“నా పేరు తులసీభాయ్ నారణ్భాయ్. కానీ మీరు నన్ను కలవాలనుకుంటే, ‘బచ్చన్‌ను పిలవండి’ అంటే చాలు. నా గురించి అందరికీ అలాగే తెలుసు," అని తనను ఎందుకు ముద్దుగా సినిమా సూపర్‌స్టార్ పేరుతో పిలుస్తారో తులసీభాయ్ చెప్పారు.
60 ఏళ్ళఈవృద్ధుడు తన కుమారుడు తనూభాయ్తో కలిసి అహ్మదాబాద్‌లోని ఓపెన్ సెటిల్మెంట్ అయిన గుల్బాయి టేక్రా సమీపంలో ఫుట్‌పాత్ మీద నివసిస్తున్నారు. తనూభాయ్ పుట్టిన వెంటనే అతని భార్య మరణించింది. “మా అమ్మమ్మే నన్ను పెంచింది. ఆమె ఇప్పటికీ బతికే ఉంది, ఆమెకు వందేళ్ళకు పైనే ఉంటాయి," అని ముప్పై సంవత్సరాల తనూభాయ్ చెప్పారు.
తండ్రీ కొడుకులు ఉదయం తొమ్మిది గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు వ్యర్థాలను సేకరించి, నగరంలోని మేమ్‌నగర్ తాలూకాలోని భంగార్వాలాలకు (వ్యర్థాల డీలర్లు) విక్రయిస్తారు. వ్యర్థాలను సేకరించేవాళ్ళు వాటిని కిలోగ్రాముల లెక్కన విక్రయిస్తారు.
ఈ రిపోర్టర్ వాళ్ళను కలిసిన రోజున, మధ్యాహ్నం రెండు గంటల నుంచి పనిచేస్తోన్న వాళ్ళిద్దరూ, సుమారు నాలుగు కిలోల బరువుండే ప్లాస్టిక్ సీసాలను, ఒక కిలో బరువుండే అట్టముక్కలను (కార్డ్బోర్డ్) సేకరించారు. ఈ వ్యర్థాలను అమ్మడం ద్వారా వాళ్ళకు డీలర్ నుంచి రూ.110 లభించింది. "ఈసారి వేసవి చాలా వేడిగా ఉంది," తులసీభాయ్ అన్నారు. "దీనివల్ల మేం జబ్బుపడతాం. రోజంతా ఎండ వేడిమిని తట్టుకోవడానికి మేం సేకరించిన ఈ అట్టముక్కలతో విసురుకుంటాం."






