తన ఇంటి బయట ఉన్న మామిడి చెట్టు కింద కూర్చొనివున్న సరూ విచారంగా కనిపిస్తోంది. ఆమె ఒళ్ళో ఉన్న చంటిబిడ్డ అశాంతిగా కదులుతూ, వచ్చీరాని మాటలాడుతున్నాడు. "నాకు ఏ రోజైనా బహిష్టు రావొచ్చు," అంటుందామె. "అప్పుడు నేను కుర్మా ఘర్కి వెళ్ళాల్సివుంటుంది." 'బహిష్టు గుడిసె' అయిన ఈ కుర్మా ఘర్లోనే ఆమె ఋతుస్రావం జరిగే ఆ నాలుగైదు రోజులు ఉంటుంది.
దగ్గరపడుతోన్న ఆ రోజు సరూను (అసలు పేరు కాదు) కలవరపెడుతోంది. "కుర్మా ఘర్లో ఉక్కిరిబిక్కిరిగా ఉంటుంది, నేను నా పిల్లలకు దూరంగా అస్సలు నిద్రపోలేను కూడా," తన తొమ్మిది నెలల కొడుకును శాంతింపజేయడానికి ప్రయత్నిస్తూ అందామె. ఆమెకు కోమల్ (అసలు పేరు కాదు) అనే కూతురు కూడా ఉంది. మూడున్నర సంవత్సరాల వయస్సున్న కోమల్ నర్సరీ పాఠశాలలో చదువుతోంది. “ఆమె పాళీ [ఋతు చక్రం] కూడా ఏదో ఒక రోజు మొదలవుతుంది; ఇది నన్ను భయపెడుతోంది,” తన కూతురు కూడా తమ మాడియా తెగ సంప్రదాయ పద్ధతులను భరించవలసి వస్తుందనే ఆదుర్దాతో ఉన్న 30 ఏళ్ళ సరూ చెప్పింది.
సరూవాళ్ళ గ్రామంలో నాలుగు కుర్మా గుడిసెలున్నాయి. అందులో ఒకటి ఆమె ఇంటికి 100 మీటర్ల కంటే తక్కువ దూరంలోనే ఉంది. వీటిని ప్రస్తుతం గ్రామంలో ఋతుక్రమం సాగే 27 మంది తరుణ వయస్కులైన బాలికలు, మహిళలు ఉపయోగిస్తున్నారు. “నేను మా అమ్మనీ, అమ్మమ్మనీ కుర్మా ఘర్కి వెళ్ళడం చూస్తూ పెరిగాను. ఇప్పుడు నేను దాన్ని ఉపయోగిస్తున్నాను. ఈ పద్ధతి వలన కోమల్ బాధపడటం నాకు ఇష్టం లేదు,” అని సరూ చెప్పింది.
మాడియా ఆదివాసీ తెగలో ఋతుక్రమంలో ఉన్న స్త్రీలను అపవిత్రులుగానూ అంటరానివారుగానూ భావిస్తారు. బహిష్టు వచ్చినప్పుడు వారిని ఇంటి నుంచి దూరంగా పంపించివేస్తారు. "నాకు 13 ఏళ్ళప్పటి నుండి కుర్మా ఘర్కి వెళుతున్నాను," అని సరూ చెప్పింది. అప్పుడామె మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా తూర్పు ప్రాంతంలోని తన తల్లిదండ్రుల ఇంట్లో ఉండేది. ప్రస్తుతం ఆమె నివాసముంటోన్న ఇంటికి ఆ గ్రామం 50 కిలోమీటర్ల దూరంలో ఉంది.
గత 18 సంవత్సరాలలో, సరూ తన జీవితంలో దాదాపు 1,000 రోజులు - ప్రతి నెలా దాదాపు ఐదు రోజులు - స్నానాల దొడ్డి లేని, మంచినీరు, విద్యుత్తు, మంచం, ఫ్యాన్ లాంటివి ఏమీ లేని ఆ గుడిసెలో గడిపింది. “ఇక్కడ లోపలంతా చీకటిగా ఉండి, రాత్రివేళలు భయానకంగా ఉంటాయి. చీకటి నన్ను తినేస్తుందేమోనని అనిపిస్తుంటుంది,” అని ఆమె చెప్పింది. "నా ఇంటికి వేగంగా పరిగెత్తిపోయి నా పిల్లలను గట్టిగా గుండెకు హత్తుకోవాలనిపిస్తుంది... కానీ అలా చేయలేను."


















