"ఎందుకు మమ్మల్నందరూ తిరస్కారంతో చూస్తారు? కేవలం మేం ట్రాన్స్జండర్లం అయినందుకేనా? అంటే మాకు ఇజ్జత్ (గౌరవం) అంటూ ఉండదా?" శీతల్ ప్రశ్నిస్తారు.
శీతల్ ఏళ్ళతరబడీ తనకు కలిగిన చేదు అనుభవాల నుంచి ఇలా మాట్లాడుతున్నారు. సుమారు దశాబ్దకాలంగా బడిలోనూ, పనిచేసేచోట, వీధుల్లో, దాదాపు వెళ్ళిన ప్రతిచోటా, 22 ఏళ్ళ శీతల్ వివక్షనూ వేధింపులనూ ఎదుర్కొంటూనే ఉన్నారు.
ఇదంతా తనకు 14 ఏళ్ళ వయసున్నపుడు ఇచల్కరంజిలోని నెహ్రూ నగర్లో ఉన్న ఇంటి నుంచే మొదలయింది. అప్పుడామె పేరు అరవింద్. "నేను 8, 9 తరగతుల్లో ఉండగా తరగతిలోని ఇతర ఆడపిల్లల్లా బట్టలు వేసుకోవాలని నాకనిపించేది. నాకెందుకు ఇలా జరుగుతుందో నాకు అర్థమయ్యేది కాదు... ఇంట్లో ఉన్నప్పుడు ఎప్పుడూ అద్దంలో నన్ను నేను చూసుకుంటూ ఉండేదాన్ని. 'ఎందుకు ఎప్పుడూ బాయలా ('ఆడపిల్లలా')లాగా నిన్ను నువ్వే చూసుకుంటావు? బయటికెళ్ళి మగపిల్లలతో ఆడుకో పోయి’ అని మా నాన్న కేకలేస్తుండేవాడు. నాకు చీర కట్టుకోవాలని ఉందనీ, అమ్మాయిలాగా జీవించాలని ఉందనీ చెప్పినపుడు ఆయన నన్ను కొట్టి, పిచ్చాసుపత్రిలో చేర్పిస్తానని అనేవాడు. ఆయన నన్ను కొట్టినపుడల్లా నేను చాలా ఏడ్చేదాన్ని..."
శీతల్ (ఆమె అభ్యర్థన మేరకు పేరు మార్చాం) కుటుంబం తమ కొడుకును ‘బాగుచేయించడానికి’ ఒక తాంత్రికుని దగ్గరకు కూడా తీసుకెళ్ళారు. "నాకెవరో చేతబడి చేశారని మా అమ్మ అనేది. మా నాన్న (తుక్కును అమ్మే వ్యాపారం చేసేవారు) ఒక కోడిపెట్టను కూడా బలి ఇచ్చాడు. నేను శారీరకంగా అబ్బాయినే అయినప్పటికీ నాకు అమ్మాయిలా ఉండాలని ఉందనే విషయాన్ని నా తల్లిదండ్రులు అర్థంచేసుకోలేకపోయేవారు. నేను చెప్పేది వినిపించుకునేవారుకాదు."
పదహారేళ్ళ వయసులో శీతల్ తన ఇంటినుంచి వచ్చేసి, వీధుల్లో అడుక్కోవడం మొదలుపెట్టారు. ఆమె ఇప్పటికీ ఆ పని చేస్తున్నారు. ఉదయం 10 గంటల నుండి చీకటి పడేవరకూ ఆమె దుకాణాల వెంట తిరిగి డబ్బులు అడుగుతుంటారు; దగ్గరలో ఉన్న పట్టణాలైన జైసింగ్నగర్, కొల్హాపుర్, సాంగ్లిలకు కూడా వెళ్తుంటారు. ఇలా రోజుకు రూ.100- 500 వరకూ సంపాదిస్తారు. కొన్నిసార్లు ఆమెనూ, మరో నలుగురైదుగురు ఆమె స్నేహితులైన ట్రాన్స్జండర్లనూ పెళ్ళిళ్ళలో, పేరు పెట్టే పండుగలలో, మతపరమైన జాగారాల వంటి ఇతర కార్యక్రమాలలో ఆడి పాడటానికి జనం పిలుస్తుంటారు. ఇలాంటి వాటి ద్వారా వారికి మనిషికి రూ. 2000 - 3000 వరకూ సంపాదన ఉంటుంది.








