తమిళనాడులోని వడనమ్మేలి గ్రామంలో అప్పుడే చీకటిపడుతోంది. కారియక్కూత్తు ప్రదర్శన కోసం శ్రీ పొన్నియమ్మన్ తెరుక్కూత్తు మండ్రమ్ సభ్యులు సిద్ధపడుతున్నారు. ఎప్పటిలాగే, ఇది అనేక పాత్రలు, అనేక దుస్తుల మార్పిడులతో సాయంత్రం నుండి తెల్లవారుజాము వరకూ సాగే ప్రదర్శన.
తెరవెనుక, 33 ఏళ్ళ శర్మి మేకప్ వేసుకోవడం ప్రారంభించారు. ఆమె తన స్వంత లిప్‌స్టిక్‌ను తయారుచేసుకోవడానికి నూనెలో ఎర్రటి పొడిని కలుపుతూ, అరిదారమ్ (మేకప్) గురించి కొన్ని ప్రాథమిక నియమాలను వివరిస్తున్నారు: “అరిదారమ్ పురుషులకు, స్త్రీలకు వేరువేరుగా ఉంటుంది. ఇది పాత్రను బట్టి, పాత్ర నిడివిని బట్టి కూడా భిన్నంగా ఉంటుంది.
తమిళనాడులోని పురాతన కళారూపాలను ప్రదర్శించే నాటక సంస్థలలో ఒకటిగా భావించే శ్రీ పొన్నియమ్మన్ తెరుక్కూత్తు మండ్రమ్‌లోని 17 మంది సభ్యుల బృందంలో ఉన్న నలుగురు ట్రాన్స్‌జెండర్ కళాకారులలో శర్మి ఒకరు. "నా తరానికి ముందు కూడా తెరుక్కూత్తును ప్రదర్శించేవారు," అన్నారు శర్మి. “ఇది ఎంత పాతదో నేను ఖచ్చితంగా చెప్పలేను."
తెరుక్కూత్తు, లేదా వీధి నాటకం సాధారణంగా మహాభారతం, రామాయణం వంటి ఇతిహాసాల కథల ఆధారంగా రాత్రిపూట ప్రదర్శనలనిస్తుంది. తెరుక్కూత్తు సీజన్ సాధారణంగా పంగుణి (ఏప్రిల్), పురట్టాసి (సెప్టెంబర్) నెలల మధ్యకాలంలో వస్తుంది. ఈ కాలంలో శర్మి, ఆమె బృందం ఆదివారం తప్ప దాదాపు ప్రతి రోజూ ప్రదర్శనలు ఇస్తారు. ఆ విధంగా ఒక నెలలో దాదాపు 15-20 ప్రదర్శనల వరకూ ఉంటాయి. ప్రతి ప్రదర్శనకు రూ. 700-800 చొప్పున, అంటే నెలకు ఒక్కో ఆర్టిస్టుకు దాదాపు రూ. 10,000-15,000 వరకూ ఆదాయం వస్తుంది.
అయితే, సీజన్ ముగిసిన తర్వాత కళాకారులు ప్రత్యామ్నాయ ఆదాయ వనరుల కోసం వెతకవలసి వస్తుంది. ఆచార ఆధారిత తెరుక్కూత్తుకు మరో రూపమైన కారియక్కూత్తును అంత్యక్రియల సమయంలో మాత్రమే ప్రదర్శిస్తారు. తిరువళ్ళూరు జిల్లాలోని పట్టరైపెరుంబుదూర్లోని తన డ్రామా కంపెనీ ఇంటికి దాదాపు 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న వడనమ్మేలిలో కారియక్కూత్తు ప్రదర్శనకు సిద్ధపడుతూ, “ఒకరి మరణం మాకు వారానికి ఒకటి లేదా రెండు ప్రదర్శనలను ఇస్తుంది,” అన్నారు శర్మి.
























