ఆయన ఒక పాత్రలో నటించినప్పుడు కూడా, బయటకు చెప్పని నియమాలు ఉంటాయి. ఆయన రావణుడు లేదా అసురుడు (రాక్షసుడు) కావచ్చు, కానీ ఎప్పుడూ కృష్ణుడు కానీ రాముడు కానీ కాలేడు.
"మాలాంటివాళ్ళు దేవుళ్ళు కాలేరు," అన్నారతను.
16వ శతాబ్దపు అస్సామ్‌లోని సత్రాలు చారిత్రాత్మకంగా భావనాను ఆచరించే ఆధిపత్య కుల వైష్ణవ సన్యాసుల ఆధిపత్యంలో ఉండేవి. దీని వలన ఈ కళలోని దైవిక పాత్రలు ఆధిపత్య కులాలకు చెందిన అస్సామీలను కోరుకుంటాయనే నమ్మకానికి దారితీసింది, ఒక సంప్రదాయంగా ఆమోదించబడేంత తరచుగా ఇది పునరావృతమైంది. కాబట్టి మిసింగ్, ఇతర తెగలను ఎల్లప్పుడూ బయటి వ్యక్తులుగానే పరిగణిస్తారు.
అలాగే, సంప్రదాయకంగా భావనా ప్రదర్శనల నుండి స్త్రీలను కూడా మినహాయించారు.
"వారు స్త్రీ పాత్రలు పోషించడానికి స్త్రీ లక్షణాలు కలిగిన అబ్బాయిలను ఇష్టపడతారు" స్త్రీ పాత్రల కోసం ఎంపికైనప్పటికీ ఎగతాళిని ఎదుర్కొన్న బిపుల్ వివరించారు. "మీరు వారి కపటత్వాన్ని గనక గమనిస్తే, వారు మమ్మల్ని వేదికపై 'దేవి' [దేవత] అని పిలుస్తారు, కానీ వేదిక వెలుపల 'ఆడవాళ్ళు’, 'హిజ్రా' [నపుంసకులు] అని పిలుస్తారు," అన్నారతను.
దక్ష యజ్ఞం కంటే తన నుండి మరే నాటకం ఎక్కువ నైపుణ్యాన్ని కోరుకోదని ఆయన అంటున్నారు. తీవ్ర భావోద్వేగపరమైన ఈ నాటకంలో ఆయన శివుడి భార్య సతి పాత్రను పోషిస్తారు - ఈ పాత్ర ప్రతిసారీ ఆయనను అలసిపోయేలా చేస్తుంది. "ఇది సవాలుతో కూడుకున్నది. ఎందుకంటే నేను ఏడవాలి, అరవాలి, అనేక భావోద్వేగాలను బయటకు తీసుకురావాలి," అని ఆయన అంటున్నారు. "ఎంత ప్రయత్నించినప్పటికీ, నేను ఒక పురుషుడిని. స్త్రీ గొంతు తీసుకురావడం కష్టంగా అనిపిస్తుంది, కాబట్టి నేను నెలల తరబడి సాధన చేస్తాను," అన్నారాయన.
పవిత్ర నామ్ఘర్లలో మహిళలు ప్రదర్శన ఇవ్వడం అనే ప్రశ్న ఎప్పుడూ తలెత్తదని లఖింపూర్‌లోని విశ్రాంత ఉపాధ్యాయుడు థానేశ్వర్ బొరా అన్నారు. "ఇక్కడ మహిళలకు అనుమతి లేదు, అలాగే తక్కువ కులాల వారికి కూడా," అని ఈ స్థానిక వైష్ణవ చరిత్రకారుడు అంటున్నారు.