"మంచాలను అల్లటం నా రక్తంలోనే ఉంది," నులక మంచాలను అల్లేవారిలో మూడవ తరానికి చెందిన కృష్ణావతి నవ్వుతూ అన్నారు. "నేను పెళ్ళి చేసుకున్నది కూడా ఆ కళను ఇష్టపడేవాడినే," థారూ సముదాయానికి చెందిన ఆ 45 ఏళ్ళ మహిళ మాతో చెప్పారు.
దాదాపు మూడు దశాబ్దాలుగా కృష్ణావతి, ఆమె భర్త చంద్రపాల్ సింగ్ రాణాలు నులక మంచాలను - చెక్క పలకల స్థానంలో నులకను అల్లే మంచాలు - తయారుచేస్తున్నారు. వాళ్ళు చెక్కను నరికి మంచం కోళ్ళుగా, పట్టెలుగా తయారుచేసి, ఆ మంచాన్ని నులకతో అల్లుతారు.
వేసవి కాలాల్లో, ఉష్ణోగ్రత పెరిగిపోయినప్పుడు జనం ఈ మంచాలను వాడేందుకు ఇష్టపడుతుండటంతో ఈ మంచాలను అల్లేవారు మే నెల నుంచి సెప్టెంబర్ నెల వరకూ ఈ పనే చేస్తారు; మిగిలిన ఏడాది మొత్తం వ్యవసాయ కూలీలుగా పనిచేస్తారు. కృష్ణావతి రోజు కూలీగా రూ. 350 సంపాదిస్తే, చంద్రపాల్ ఆమె కంటే ఒక వంద రూపాయలు ఎక్కువ సంపాదిస్తారు. వారికి ఏడాది మొత్తమ్మీద 120-150 రోజుల పని దొరుకుతుంది.















