"దీని గరిష్ట వేగం గంటకు 30 కిలోమీటర్లు, కానీ ఇది 27కి మించి వెళ్ళదు."
అయినా కూడా తన వాహనం మళ్ళీ పనిచేయడం గురించి వసీమ్ ఖురేషి సంతోషంగా ఉన్నారు. 34 ఏళ్ళ వసీమ్ పనికి వెళ్ళి, రావడానికి ఈ మోటారు ట్రైసైకిల్‌ను ఉపయోగిస్తారు.
వైరింగ్ ఇంకా కొంచెం తికమకపెడుతూనే ఉందని, బ్రేక్‌లను ఉపయోగిస్తున్నప్పుడు తాను మరింత జాగ్రత్తగా ఉండాలని, బైక్ ఎక్కుతూ నాతో అన్నారాయన. ట్రైసైకిల్పైన అమర్చిన కుర్చీలో సౌకర్యంగా కూర్చొని, సీటు కింద ఉన్న బ్యాటరీని, దాని వెనుక ఉన్న ఒక చిన్న స్టోరేజ్ కంపార్ట్మెంట్ను నాకు చూపించడానికి క్రిందికి వంగారు.
వసీమ్ తన బైక్‌ను స్టార్ట్ చేసి, దిల్లీ-అల్వార్ జాతీయ రహదారి వెంబడి చెట్ల వెనుక ఉన్న తన చిన్న మొబైల్ మరమ్మతు దుకాణానికి వెళ్తున్నారు. అది హరియాణాలోని మాండీఖేడాలో ఉన్న ఆయన గ్రామం నుండి ఒక కిలోమీటరు కంటే తక్కువ దూరంలో ఉంది. ఇరుగుపొరుగు పిల్లలు ఆయన ట్రైసైకిల్ వెనుకే పరుగెడుతూ, వెనుక ఉన్న చిన్న కంపార్ట్మెంట్ మీదకు నవ్వుతూ దూకుతుండటాన్ని నేను చూస్తున్నాను. వారి దూకుళ్ళను పట్టించుకోకుండా ఆయన వారి నవ్వులతో జతకలుపుతున్నారు.












