"లై దే వే జుత్తీ మైనూఁ,
ముక్త్సరీ కఢాయీ వాలీ,
పైరాఁ విచ్ మేరే చన్నా
జచుగీ పయీ బహాలీ"
"ముక్తసర్ చేతి కుట్టుపని చేసిన
జుత్తీ నాకు కొనిస్తావా, ప్రియా
అందమైన నా పాదాలకి అవి
ఎంత చక్కగా అమరుతాయో కదా"



"లై దే వే జుత్తీ మైనూఁ,
ముక్త్సరీ కఢాయీ వాలీ,
పైరాఁ విచ్ మేరే చన్నా
జచుగీ పయీ బహాలీ"
"ముక్తసర్ చేతి కుట్టుపని చేసిన
జుత్తీ నాకు కొనిస్తావా, ప్రియా
అందమైన నా పాదాలకి అవి
ఎంత చక్కగా అమరుతాయో కదా"
తన చేతిలో ఉన్న బిరుసైన నూలు దారాన్ని ఇంకొంచెం బిగించి పట్టుకున్నారు హన్స్ రాజ్. మొనదేరిన ఉక్కు సూది సహాయంతో ఆ దారాన్ని గట్టి తోలులోకి దించి, ఎంతో చాకచక్యంగా సూదిని కదిలిస్తూ, దగ్గర దగ్గర నాలుగు వందల కుట్లు వేస్తేనే ఒక జత పంజాబీ జుత్తీ (కాలి వేళ్ళను కప్పివుంచే ఒకరకం చెప్పులు) తయారవుతుంది. ఆయన పనిచేస్తూ విడిచే బరువైన నిట్టూర్పులు, 'హుమ్మ్' అనే శబ్దాలు తప్ప అంతా నిశ్శబ్దంగా ఉంటుంది.
పంజాబులోని శ్రీముక్తసర్ సాహిబ్ జిల్లా, రూపాణా గ్రామంలో, హన్స్ రాజ్ మాత్రమే ఈ జుత్తీలని సాంప్రదాయక పద్ధతిలో తయారుచేయగల ఏకైక చేతిపనివాడు.
"చాలామందికి పంజాబీ జుత్తీ ఎలా, ఎవరు తయారుచేస్తారో తెలియదు. అందరూ వీటిని యంత్రాలు చేస్తాయని అనుకుంటారు. కానీ, ఇవి మొదటి నుంచీ చివరివరకూ పూర్తిగా చేతితోనే తయారవుతాయి," అంటారు హన్స్ రాజ్. అరవై మూడు సంవత్సరాల వయసున్న ఆయన, దాదాపు అర్ధ శతాబ్దకాలంగా ఈ జుత్తీలను తయారుచేస్తున్నారు. "మీరు ఎక్కడికైనా వెళ్ళండి - ముక్తసర్, మలోట్, గిదర్బాహా, ఇంకా పటియాలా - నా అంత శ్రద్ధగా జుత్తీలు చేసేవాళ్ళు మీకు దొరకరు," అని చాలా మామూలుగా అంటారు హన్స్ రాజ్.
ప్రతి రోజూ ఉదయం ఏడు గంటల నుంచి ఆయన తన అద్దె దుకాణం ద్వారం దగ్గర ఒక దూది పరుపు మీద కూర్చుని ఉంటారు. ఆ దుకాణం గోడలలో కొంత భాగం జుత్తీలతో నిండి ఉంటాయి. అందులో మగవాళ్ళ కోసం చేసినవి, ఆడవాళ్ళ కోసం చేసినవి కూడా ఉంటాయి. ఒక జత ఖరీదు 400 రూపాయల నుండి 1600 రూపాయల వరకు ఉంటుంది. ఈ వృత్తి నుంచి తనకు నెలకు 10,000 రూపాయల వరకూ సంపాదన ఉంటుందని చెప్పారాయన.

Naveen Macro

Naveen Macro

Naveen Macro

Naveen Macro
మాసిపోయిన ఆ గోడకి ఆనుకుని కూర్చుని, ఆయన రోజుకి పన్నెండు గంటల పాటు చేతితో చెప్పులు కుడుతూనే ఉంటారు. అతను అలసిపోయిన వీపుని ఆన్చి కూర్చునే చోట గోడ అరిగిపోయి ఉంది - సిమెంటు పెచ్చులు రాలి లోపల ఉన్న ఇటుకలు కనిపిస్తున్నాయి. "ఒళ్ళు నొప్పులుగా ఉంటుంది, కాళ్ళయితే మరీనూ," అంటారు హన్స్ రాజ్, తన మోకాళ్ళ చిప్పలు రుద్దుకుంటూ. "వేసవి కాలంలో చెమట పోసి, వీపు మీద వచ్చే దానే జా (కురుపులు) బాగా నొప్పి పెడతాయి."
హన్స్ రాజ్ తన పదిహేనేళ్ళ వయసులో, వాళ్ళ నాన్న దగ్గర ఈ వృత్తివిద్య నేర్చుకున్నారు. "అప్పట్లో నాకు బయట తిరగటం మీద ఎక్కువ ఆసక్తి ఉండేది. కొన్నిరోజులు నేర్చుకోవడానికి కూర్చునేవాడిని, కొన్నిరోజులు లేదు." అయితే అతను పెద్దవాడు అయ్యేకొద్దీ పని చేయాలన్న వత్తిడి, కూర్చునే గంటలూ పెరిగాయి.
పంజాబీ, హిందీ కలగలిసిన భాష మాట్లాడుతూ ఆయన, "ఈ పనికి చాలా బారీకీ (ఖచ్చితత్వం) కావాలి," అంటారు. ఇన్ని సంవత్సరాలుగా కళ్ళద్దాల అవసరం లేకుండానే పనిచేశారు కానీ, "ఈ మధ్య కంటిచూపులో తేడా తెలుస్తుంది. కొన్ని గంటలు పనిచేసిన తర్వాత కళ్ళకి అలసట వస్తుంది. అన్నీ రెండుగా కనబడతాయి."
అతను మామూలు పని రోజుల్లో టీ తాగుతూ, రేడియోలో పాటలు, వార్తలు, క్రికెట్ వ్యాఖ్యానం వింటూ ఉంటారు. శ్రోతలు కోరిన హిందీ, పంజాబీ పాటలు వినిపించే 'ఫర్మాయిషీ కార్యక్రమం' అతనికి ఇష్టమైన కార్యక్రమం. అయితే, అతను ఎప్పుడూ ఆ కార్యక్రమానికి ఫోను చేయలేదు. "నాకు అంకెలు అర్థం కావు, ఫోను కలపలేను," అంటారు.

Naveen Macro

Naveen Macro
హన్స్ రాజ్ ఎప్పుడూ బడికి వెళ్ళలేదు కానీ వాళ్ళ ఊరు దాటి కొత్త కొత్త ప్రదేశాలు చూడటం అంటే అతనికి ఎంతో సంతోషం. పక్క ఊళ్ళో మతపెద్దగా ఉన్న తన స్నేహితుడితో కలిసి వెళుతుంటారు. "ప్రతి సంవత్సరం, ఒక యాత్ర చేస్తాము. అతనికి సొంత కారు ఉంది, అందులో నన్ను కూడా తీసుకువెళతాడు. ఇంకొక ఇద్దరు ముగ్గురితో కలిసి, మేము హరియాణాలోని చాలా ప్రదేశాలు, రాజస్థాన్లోని అల్వర్, బీకానేర్ తిరిగి చూశాము."
*****
అప్పటికి సాయంత్రం నాలుగు గంటలు దాటేసింది. రూపాణా గ్రామం, తనను వదిలి పోలేక పోతున్న చలికాలపు సూర్యుడి వెచ్చటి వెలుగుతో నిండిపోయింది. ఎప్పటి నుంచో హన్స్ రాజ్ దగ్గర జుత్తీలు కొంటున్న ఖాతాదారుడు ఒకాయన, తన స్నేహితుణ్ణి కూడా తీసుకుని వచ్చారు. "ఇతనికి కూడా ఒక జుత్తీ కావాలి. రేపటికల్లా చేస్తారా?" అని అడుగుతున్నారు అతను. ఆ స్నేహితుడు ఎంతో దూరం నుంచి - హరియాణాలోని టోహానా - అంటే 175 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చారు.
హన్స్ రాజ్ చిన్నగా నవ్వుతూ, స్నేహంగా సమాధానం ఇచ్చారు, "రేపటికల్లా అంటే కుదరదు మిత్రమా." అయితే ఆ వచ్చిన ఖాతాదారుడు వదలలేదు: "ముక్తసర్ పంజాబీ జుత్తీలకి పేరు మోసింది." అతను మావైపు తిరిగి, "పట్నంలో వేలకొద్దీ జుత్తీ దుకాణాలు ఉన్నాయి. కానీ ఇక్కడ రూపాణాలో చేతితో జుత్తీలు తయారుచేసేది ఇతను ఒక్కడే. మాకు ఇతని పనితనం బాగా తెలుసు."
కొనటానికి వచ్చిన ఆయన, దీపావళి వరకూ మొత్తం దుకాణం నిండా జుత్తీలు ఉంటాయని చెప్పారు. ఒక నెల తర్వాత నవంబర్లో 14 జతలు మాత్రం మిగిలి ఉన్నాయి. హన్స్ రాజ్ జుత్తీల ప్రత్యేకత ఏమిటి? "ఈయన చేసే జుత్తీలు మధ్యలో చదునుగా ఉంటాయి," గోడమీదున్న జుత్తీలు చూపిస్తూ చెప్పారు. "ఆ ప్రత్యేకత పనిలో నైపుణ్యం తెలిసినవాడి చేతిలో ఉంటుంది."

Naveen Macro

Naveen Macro
హన్స్ రాజ్ పని అంతా ఒక్కడే చేయరు - కొన్ని జుత్తీలను 12 కిలోమీటర్ల దూరంలోని వాళ్ళ సొంత ఊరు ఖునన్ ఖుర్ద్లో ఉండే సంత్ రామ్ అనే చెప్పులు కుట్టే నిపుణుడి చేత కుట్టిస్తారు. దీపావళి లేదా వరి పంట కాలంలో గిరాకీ ఎక్కువగా ఉన్నప్పుడు, ఒక్కొక్క జతకు 80 రూపాయల చొప్పున యిచ్చి అతనితో కుట్టించుకుంటారు.
చేతి పని తెలిసిన కళాకారుడికీ, ఊరికే చేతిపని చేసేవాడికీ తేడా ఏమిటో ఆయన ఇలా చెప్పారు: "నేను ఎప్పుడూ జుత్తీని పన్నా (పై భాగం) అడుగు అట్ట చివరి నుంచీ కుట్టటం మొదలుపెడతాను. జుత్తీలు తయారుచేయటంలో ఇది అన్నిటికన్నా కష్టమైన భాగం. ఇది సరిగ్గా చేయగలిగినవాడు మిస్త్రీ (చేతిపని తెలిసినవాడు), లేకపోతే లేదు."
అయితే, ఆ విద్య ఆయనకి సులువుగా ఏమీ రాలేదు. "మొదట్లో నాకు దారంతో చెప్పులు కుట్టటం సరిగ్గా వచ్చేది కాదు," అని గుర్తుచేసుకున్నారు హన్స్ రాజ్. "అయితే నేర్చుకోవాలని నేను నిశ్చయించుకున్న తర్వాత, రెండు నెలల్లో నేర్చేసుకున్నాను. ఇక మిగిలిన విద్య అంతా మెల్లగా నేర్చుకున్నాను. మొదట్లో మా నాన్నని అడిగి నేర్చుకునేవాడిని, తర్వాత ఆయన్ని గమనిస్తూ నేర్చుకున్నాను."
సంవత్సరాల తరబడి పని చేయటంలో, అతను కొన్ని కొత్త ప్రక్రియలు కనిపెట్టారు. జుత్తీకి రెండు వైపులా, అన్ని అతుకులనీ కలుపుతూ చిన్న తోలు ముక్కలు కుట్టటం వాటిలో ఒకటి. "ఈ చిన్న ముక్కలు జుత్తీని బలంగా చేస్తాయి. చెప్పులు తొందరగా తెగకుండా ఉంటాయి," అని వివరించారు.

Naveen Macro

Naveen Macro
*****
హన్స్ రాజ్, నలుగురు సభ్యులున్న ఆయన కుటుంబం - భార్య వీర్ పాల్ కౌర్, ఇప్పుడు పెళ్ళిళ్ళు చేసుకుని, పిల్లలు ఉన్న ఇద్దరు కొడుకులు, ఒక కూతురు - అందరూ ఖునాన్ ఖుర్ద్ నుండి రూపాణాకి 18 సంవత్సరాల క్రితం వచ్చారు. ఇప్పుడు 36 సంవత్సరాల వయసులో ఉన్న వాళ్ళ పెద్దబ్బాయి ఇక్కడున్న పేపర్ మిల్లులో పనిచేయటం మొదలుపెట్టారు.
"ఖునన్ ఖుర్ద్ లో జుత్తీలు తయారుచేసే కుటుంబాలు దాదాపుగా అందరూ దళితులే. ఇళ్ళలోనే పనిచేసేవాళ్ళు. కాలం గడిచే కొద్దీ, కొత్త తరం ఆ విద్య నేర్చుకోలేదు. పని తెలిసినవాళ్ళు చనిపోయారు," అన్నారు హన్స్ రాజ్.
ఇప్పుడు వాళ్ళ ఊళ్ళో ముగ్గురే చేతిపని కళాకారులు చేతితో పంజాబీ జుత్తీలు తయారుచేస్తున్నారు. అందరూ అతనిలాగే (ఆ రాష్ట్రంలో షెడ్యూల్ కులంగా గుర్తించబడిన) రామ్దాసీ చమార్ కులానికి చెందినవారు. రూపాణాలో అయితే హన్స్ రాజ్ ఒక్కరే మిగిలారు.
“ఖునన్ ఖుర్ద్ లో మా పిల్లలకు భవిష్యత్తు ఏమీ కనపడలేదు, అందుకే అక్కడ స్థలం అమ్మేసి ఇక్కడ కొనుక్కున్నాం," అని చెప్పారు వీర్పాల్ కౌర్. ఆమె గొంతులో ఒక నిశ్చయం, ఒక ఆశ కలిసి వినిపించాయి. ఉత్తరప్రదేశ్, బిహార్ రాష్ట్రాల నుంచి వలస వచ్చిన చాలామంది ఇక్కడి పేపర్ మిల్లులో పనిచేస్తూ చుట్టుపక్కల అద్దె గదుల్లో ఉంటూ ఉంటారు. ఆ ప్రభావం వల్ల ఆమె చక్కటి హిందీ మాట్లాడుతున్నారు.

Naveen Macro

Naveen Macro

Naveen Macro

Naveen Macro
హన్స్ రాజ్ కుటుంబం వలస పోవటం ఇది మొదటిసారి ఏమీ కాదు. "మా నాన్న హరియాణాలోని నార్నౌల్ నుంచి ఇక్కడికి వచ్చి జుత్తీలు చేయటం మొదలుపెట్టారు," అంటారు హన్స్ రాజ్.
2017లో శ్రీ ముక్తసర్ సాహిబ్ జిల్లాలో ఉన్న గురు నానక్ మహిళా కళాశాలవారు చేసిన అధ్యయనంలో, 1950 ప్రాంతంలో జుత్తీలు తయారు చేసే వేలకొద్దీ కుటుంబాలు రాజస్థాన్ నుండి పంజాబుకు వలస వచ్చాయని తేలింది. హన్స్ రాజ్ స్వంత ఊరు నార్నౌల్ హరియాణా, రాజస్థాన్ సరిహద్దుల్లో ఉంది.
*****
"నేను పనిచేయటం మొదలుపెట్టిన రోజుల్లో ఒక జత జుత్తీ 30 రూపాయలు ఉండేది. ఇప్పుడు పూర్తిగా కుట్టుపని చేసిన ఒక జత 2500 రూపాయల వరకూ ఉంది," అని గుర్తు చేసుకున్నారు హన్స్ రాజ్.
తన దుకాణంలో చెల్లాచెదురుగా పడివున్న చిన్నా పెద్దా తోలు ముక్కలలో నుంచి రెండు రకాల తోలును చూపించారు హన్స్ రాజ్: ఆవు తోలు, గేదె తోలు. "గేదె తోలు చెప్పు అడుగు భాగానికీ, ఆవు తోలు పై భాగానికీ వాడతాం," అని వివరించారు. తన వృత్తి విద్యకి ఒకప్పుడు వెన్నెముకగా నిలిచిన ఆ ముడి పదార్థాన్ని ఆయన చేతులు నిమురుతూ ఉన్నాయి.
పదును చేసిన ఆవు తోలును చూపిస్తూ, పశువు చర్మాన్ని తాకటానికి సిద్ధమేనా అని మమ్మల్ని అడిగారు. మేం సరే అనగానే, ఆయన పదును చేసిన తోలును చూపించటమే కాక, రెండు రకాల మధ్య తేడాలను కూడా పరిశీలనగా చూపించారు. గేదె తోలు దాదాపు 80 కాగితాల బొత్తి అంత మందంగా ఉంది. ఆవు తోలు చాలా పల్చగా, బహుశా పది కాగితాల మందం ఉంది. తాకి చూస్తే, గేదె తోలు నునుపుగా, గట్టిగా ఉంది. ఆవు తోలు కొంచెం గరుకుగా ఉన్నా మెత్తగా, తేలికగా వంగుతూ ఉంది.

Naveen Macro

Naveen Macro

Naveen Macro
ఈ పనికి అత్యవసర ముడి పదార్థమైన తోలు రేట్లు పెరగటం, అందరూ ‘బూట్-చెప్పల్’ అని ఆయన పిలిచే బూట్లు, రబ్బరు చెప్పులు వాడటానికి ఎక్కువ ఇష్టపడటం, ఈ రెండు కారణాల వల్ల ఈ వృత్తిపని చేయటంలో ఎక్కువమంది ఆసక్తి చూపించటం లేదు.
హన్స్ రాజ్ తన పనిముట్లని ఎంతో జాగ్రత్తగా చూసుకుంటారు. జుత్తీలకు ఆకారాన్ని ఇవ్వటానికి, చర్మంపై గీకటానికి రంబి (కత్తి)ని ఉపయోగిస్తారు; తోలు బిరుసుగా అయ్యే వరకూ మోర్గా (చెక్క సుత్తి)తో మోదుతారు. ఆ చెక్క మోర్గా, ఒక లేడి కొమ్ము ఆయనకు వాళ్ళ నాన్న నుంచి సంక్రమించాయి. వాటిని ఆయన చెప్పు లోపలి వైపు నుండి ఆకారాన్ని ఇచ్చేందుకు వాడతారు. ఆ లేడి కొమ్ము లేకుండా కేవలం చేతితో లోపలి ఆకారాన్ని తీసుకు రావటం చాలా కష్టం.
పదును చేసిన తోళ్ళను కొనుగోలు చేయటాని వాళ్ళ గ్రామం నుంచి 170 కిలోమీటర్ల దూరంలో ఉన్న జలంధర్ వెళతారాయన. ఒక బస్సులో మోగా వరకూ, అక్కడ నుంచి ఇంకొక బస్సులో జలంధర్ లోని మండీ (టోకు ధరల దుకాణం) వరకూ వెళతారు. వెళ్ళటానికే ప్రయాణ ఖర్చులు 200 రూపాయల పైన అవుతాయి.
ఈ మధ్యనే దీపావళికి రెండు నెలల ముందు వెళ్ళి 20,000 రూపాయల విలువ చేసే 150 కిలోల పదును చేసిన తోలు తీసుకుని వచ్చారు. ఎప్పుడైనా అలా తోలు తీసుకు వచ్చేటప్పుడు ఇబ్బందులకు గురి అయ్యారా అని మేము అడిగాము. " పదును చేసినదానికంటే పదును చేయని తోలును తీసుకు రావటం ఎక్కువ ఇబ్బంది," అని వివరించారు.

Naveen Macro

Naveen Macro

Naveen Macro

Naveen Macro
ఆయన మండీకి వెళ్ళి జాగ్రత్తగా చూసి తనకి కావలిసిన నాణ్యత ఉన్న తోలును ఎంచుకుంటారు. టోకు వ్యాపారి ఆ తోలును దగ్గరలో ఉన్న ముక్తసర్ పట్టణం వరకూ పంపిస్తే, ఆయన అక్కడి నుంచి తెచ్చుకుంటారు. "అంత బరువైన సామాను ఒక్కడినే బస్సులో తీసుకురావటం కుదరదు కదా," అంటారు ఆయన.
కాలంతో పాటు జుత్తీలు తయారుచేయటానికి వాడే పదార్థాలు కూడా మారాయి. మలోట్లోని గురు రవిదాస్ కాలనీలో ఉండే రాజ్ కుమార్, మహీందర్ కుమార్ వంటి పనివాళ్ళు రెక్సిన్, మైక్రో సెల్యులార్ షీట్లు ఇప్పుడు ఎక్కువగా వాడకంలో ఉన్నాయని అంటారు. తొలి నలభైల వయసులో ఉన్న రాజ్, మహీందర్లు దళిత జాటవ్ వర్గానికి చెందినవాళ్ళు.
"మైక్రో షీట్ కిలో 130 రూపాయలు అయితే ఆవు తోలు 160 నుండీ 200 వరకూ ఉంది," అన్నారు మహీందర్. ఆ చుట్టుపక్కల తోలు చాలా అరుదైన పదార్థంగా మారిందని అంటారు వాళ్ళు. "ఇంతకు ముందు కాలనీ నిండా తోలు పరిశ్రమలు ఉండేవి, అంతటా పదునుచేయని తోలు కంపు కొట్టేది. అయితే బస్తీ పెద్దది అయ్యేకొద్దీ తోలు పరిశ్రమలన్నీ మూతపడ్డాయి," అన్నారు రాజ్.
యువతరం ఈ వృత్తిలో చేరటానికి ఎక్కువ ఆసక్తి చూపటం లేదు. ఆదాయం తక్కువ అవటం ఒక్కటే అందుకు కారణం కాదని అంటారు వాళ్ళు. "ఆ తోలు వాసన బట్టల్లోకి ఇంకి పోతుంది," అంటారు మహేందర్, "కొన్నిసార్లు వాళ్ళ స్నేహితులు కూడా వాళ్ళ చేతులు ముట్టుకోవటానికి ఇష్టపడరు."

Naveen Macro

Naveen Macro
"నా సొంత కుటుంబంలోనే పిల్లలు జుత్తీలు చేయటం లేదు," అంటారు హన్స్ రాజ్, "నా పిల్లలు దుకాణంలో అడుగుపెట్టరు, ఈ విద్యని అర్థం చేసుకుందామని అనుకోరు, మరి ఎలా నేర్చుకుంటారు? ఈ నైపుణ్యం ఉన్న చివరి తరం మాదే అవుతుంది. నేను కూడా మహా అయితే ఇంకో అయిదేళ్ళు ఈ పని చేయగలను. నా తర్వాత ఈ పని ఎవరు చేస్తారు?" అడిగారాయన.
రాత్రి భోజనానికి కూరగాయలు కోస్తూ, వీర్పాల్ కౌర్ "జుత్తీలు కుట్టుకుంటూ ఇల్లు కట్టుకోవటం జరిగే పని కాదు," అన్నారు. దాదాపు రెండు సంవత్సరాల క్రితం, వాళ్ళ పెద్దబ్బాయి పని చేసే పేపరు మిల్లు నుంచి తీసుకున్న లోను సహాయంతో వాళ్ళు ఒక పక్కా ఇల్లు కట్టుకోగలిగారు.
"నేను కూడా ఈమెని కుట్టుపని నేర్చుకొమ్మని చెప్పాను, కానీ ఆమె అసలు నేర్చుకోనే లేదు," తన భార్యని ఆటపట్టిస్తూ అన్నారు హన్స్ రాజ్. వాళ్ళు పెళ్ళి చేసుకుని 38 సంవత్సరాలు అవుతుంది. "నాకు ఇష్టం లేకపోయింది," వెంటనే అన్నారు వీర్పాల్. తన అత్తగారి దగ్గర నేర్చుకున్న పనితో ఆమె జరీ దారంతో ఒక గంటలో ఒక జత జుత్తీల పైన కుట్టుపని చేయగలరు.
వాళ్ళు, ముగ్గురు సభ్యులుండే వాళ్ళ పెద్దబ్బాయి కుటుంబంతో కలిసి ఉండే ఆ ఇంట్లో రెండు గదులు, ఒక వంట గది, ఒక ముందు గది, ఇంటి బయటకు ఒక మరుగు దొడ్డి ఉన్నాయి. గోడల మీద బి. ఆర్. అంబేద్కర్, సంత్ రవిదాస్ల ఫోటోలు అలంకరించి ఉన్నాయి. ఇటువంటిదే సంత్ రవిదాస్ ఫోటో ఒకటి హన్స్ రాజ్ దుకాణంలో కూడా ఉంది.

Naveen Macro
"ఈ పదీ పదిహేనేళ్ళలో అందరూ మళ్ళీ జుత్తీలు వాడటం మొదలుపెట్టారు," అన్నారు వీర్పాల్, "అంతకు ముందు అసలు చెప్పులు కుట్టేవాళ్ళని తలుచునేవాళ్ళే లేరు."
ఆ రోజుల్లో హన్స్ రాజ్ కూలికి పొలం పనులు చేసేవారు. ఎప్పుడైనా ఎవరైనా అడిగితే ఒకటి రెండు రోజుల్లో జుత్తీలు కుట్టి ఇచ్చేవారు.
"ఇప్పుడు చాలామంది కాలేజీ అబ్బాయిలు, అమ్మాయిలు ఇవి వేసుకోవటానికి ఇష్టపడుతున్నారు," అన్నారు వీర్పాల్.
కొనుగోలుదారులు జుత్తీలని లూధియానా, రాజస్థాన్, గుజరాత్, ఉత్తర ప్రదేశ్ ఇలా రకరకాల ప్రదేశాలకి తీసుకువెళ్ళారు కూడా. ఒక పెద్ద కొనుగోలు గుర్తు చేసుకున్నారు హన్స్ రాజ్ - మిల్లులో పనిచేసే ఒకరి కోసం ఎనిమిది జతలు తయారుచేశారు. ఆ కొనుగోలు చేసిన ఆయన వాటిని ఉత్తర ప్రదేశ్లోని తన బంధువుల కోసం తీసుకువెళ్ళారు.
ఇప్పుడు ఉన్నచోట తన నైపుణ్యానికి తగిన పని ఉండటంతో, "ప్రతిరోజూ దీపావళి లాగే ఉంది," అంటారు హన్స్ రాజ్ సంతోషంగా.
ఈ కథనాన్ని నివేదించిన కొన్ని వారాలకు, 2023 నవంబరులో, హన్స్ రాజ్ పాక్షిక పక్షవాతానికి గురయ్యారు. ఇప్పుడు కోలుకుంటున్నారు.
ఈ కథనానికి మృణాళిని ముఖర్జీ ఫౌండేషన్ (MMF) ఫెలోషిప్ సహకారం అందించింది.
అనువాదం: వేణు జివిజికె రాజు
Want to republish this article? Please write to [email protected] with a cc to [email protected]
All donors will be entitled to tax exemptions under Section-80G of the Income Tax Act. Please double check your email address before submitting.
PARI - People's Archive of Rural India
ruralindiaonline.org
https://ruralindiaonline.org/articles/no-one-can-craft-a-jutti-like-i-do-te