ఛబి సాహా గత 25 ఏళ్ళుగా కాగితపు సంచులను తయారుచేస్తున్నారు. "ముందుగా నేను ఒక కత్తితో కాగితాన్ని మూడు ముక్కలుగా విభజిస్తాను. ఆరు సంచులు వస్తాయి. గుండ్రటి భాగాల మీద జిగురు అంటిస్తాను. తర్వాత కాగితాన్ని చతురస్రాకరంలో మడిచి, దానికి ఇంకోవైపున జిగురు అంటిస్తాను. ఈ విధంగా నేను సంచులను తయారుచేస్తుంటాను," అంటారామె.
ఆదిత్యపుర్ నివాసి అయిన 75 ఏళ్ళ ఛబి, తన రెండంతస్తుల మట్టి ఇంట్లో, వరండాలోనూ ప్రాంగణంలోనూ చెల్లా చెదురుగా పడివున్న పాత వార్తాపత్రికల మధ్య పనిచేసుకుంటూ కూర్చొని మాతో మాట్లాడుతున్నారు.
1998లో ఆమె ఈ పనిని మొదలుపెట్టినప్పుడు ఆమె భర్త ఆనందగోపాల్ సాహా జీవించే ఉన్నారు. ఆయన ఊరిజనాల ఆవులనూ మేకలనూ చూసుకుంటూ రోజుకు రూ. 40-50 సంపాదించేవారు. "మేం బీదవాళ్ళం," శుఁరీ సముదాయానికి చెందిన ఛబి సాహా చెప్పారు. "నా తిండి కోసం కొద్దిగానైనా డబ్బు సంపాదించాలనే ఆలోచనతో ఈ పనిని చేపట్టాలని అనుకున్నాను."
ఆమె తన ఇరుగుపొరుగువారు వదిలేసిన వార్తాపత్రికలను సేకరించటం మొదలుపెట్టారు. స్థానిక దుకాణాల నుంచి వెచ్చాలు తెచ్చుకున్న కాగితం పొట్లాలను చూసి ఆమె వాటిని ఎలా తయారుచేయాలో నేర్చుకున్నారు. "నేను ఈ పనినే ఎందుకు ఎంచుకున్నానంటే, వీటి తయారీకి కావలసిన వస్తువులు సులభంగా దొరుకుతాయి, ఇంకా నేను ఇంట్లో కూర్చొనే ఈ పని చేయవచ్చు," అంటూ ఆమె వివరించారు. "మొదట్లో నేను చాలా నెమ్మదిగా చేసేదాన్ని. ఒక్కో సంచీ తయారుచేయటానికి నాకు 25 నుంచి 30 నిముషాలు పట్టేది," అంటారు ఛబి.
"నేను రోజుకు ఒక కిలో (సంచులు) మాత్రమే చేయగలిగేదాన్ని," ఆమె చెప్పటం కొనసాగించారు.








