పదమూడేళ్ళుగా నౌరాదేహీ వన్యప్రాణుల అభయారణ్యంలో వన్ రక్షక్ (ఫారెస్ట్ గార్డ్)గా పనిచేస్తోన్న తారాచంద్ గోండ్, భారతీయ బూడిదరంగు తోడేళ్ళ కంటే పులులనే ఎక్కువగా చూశారు. కళ్ళద్దాల వెనుక నుండి కళ్ళు మెరుస్తుండగా, 34 ఏళ్ళ వయసున్న ఆయన ఈ విచిత్రాన్ని చూసి నవ్వుకుంటున్నారు.
విచిత్రం ఎందుకంటే, ఆయన తోడేళ్ళ కోసం అంకితం చేసిన భారతదేశపు పురాతన పార్కు గురించి మాట్లాడుతున్నారు; పులులను కేవలం 2018లో మాత్రమే అక్కడికి తీసుకువచ్చారు. కానీ భారతీయ బూడిద రంగు తోడేలు (కానిస్ లూపస్ పాలిపీస్) – భారత ఉపఖండపు స్థానిక తోడేళ్ళ ఒక ప్రాచీన జాతి – కనిపించడం చాలా కష్టం. దేశంలో కేవలం 3,000 కంటే కొంచెం ఎక్కువ సంఖ్యలో మాత్రమే బూడిద రంగు తోడేళ్ళున్నాయి. ఇది 2022లో లెక్కల ప్రకారం ఉన్న 3,682 పులుల సంఖ్య కంటే తక్కువ.
బూడిద రంగు తోడేలును మొదటిసారి చూసిన అనుభవాన్ని తారాచంద్ ఎప్పటికీ మర్చిపోలేరు: "నేను గస్తీ మొదలుపెట్టిన రెండు సంవత్సరాల తర్వాత మొదటిసారి భేడియా (తోడేలు)ను చూశాను," అని ఈ గోండు ఆదివాసీ గార్డు చెప్పారు. "నేను భరాయీ సర్కిల్లో ఒక సీనియర్ రేంజర్తో కలిసి ఉన్నప్పుడు, దూరంలో ఈ జంతువు మాకు కనిపించింది. మమ్మల్ని చూసి అది దూరంగా పారిపోతోంది. అదేమిటని నేను అతన్ని అడిగాను, దానికి అతను, 'అది భేడియా. ఈ అభయారణ్యం దానికోసమే ఉంది,' అని చెప్పాడు."
చాలాకాలం పాటు, మధ్యప్రదేశ్లోని దక్షిణ వింధ్య కొండల మీదుగా విస్తరించి ఉన్న ఈ చిట్టడవికి అధిపతులుగా, నౌరాదేహీలో ప్రధాన వేటగాళ్ళుగా ఈ తోడేళ్ళే ఉండేవి. అమిత సిగ్గరులు కావడంతో, అవి కనిపించటం చాలా కష్టమే కాక, తరచుగా వాటిని నక్కలుగా పొరబడుతుంటారు. "మనం వాటిని చూసినప్పుడు, అవి పారిపోతాయి. సాధారణంగా వాటి వీపు లేదా పక్క భాగం మాత్రమే మనకు కనిపిస్తుంది," అని సురక్షా శ్రామిక్ (అటవీ కాపలాదారు) శుభమ్ రైక్వార్ అంటారు.
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఏ రాష్ట్రంలోనూ లేనంత అత్యధికంగా 700 తోడేళ్ళున్నాయి. అయినా కూడా, "దాన్ని పట్టుకోవడమో, కళ్ళారా చూడటమో చాలా కష్టం. నేను చెబుతున్నా కదా, ఒక తోడేలు పులి కంటే కూడా చాలా తెలివైనది!" అని డాక్టర్ అనిరుద్ధ మజుందార్ అంటున్నారు. జబల్పూర్లోని రాష్ట్ర అటవీ పరిశోధనా సంస్థలో వన్యప్రాణి జీవశాస్త్రవేత్త అయిన ఆయన: నౌరాదేహి వన్యప్రాణి డివిజన్లోని భారతీయ తోడేలు జీవావరణ శాస్త్రం, దాని పరిరక్షణ పర్యవసానాలపై నాలుగు సంవత్సరాల ప్రాజెక్టుకు నాయకత్వం వహిస్తూ, వాటి ప్రవర్తనను అధ్యయనం చేస్తున్నారు.













