తాను చేయని నేరానికి టెంపూ మాంఝీ జైలులో ఉన్నాడని ఆయన కుటుంబ సభ్యులు చెప్పారు.
జహానాబాద్ కోర్టులో అతని కేసుపై జరిగిన న్యాయ విచారణలో, అతని ఇంటినుంచి స్వాధీనపరచుకొన్నట్టుగా చెప్తూ పోలీసులు సాక్ష్యంగా ప్రవేశపెట్టిన వస్తువులేవీ నిజానికి అతని ఇంటిలో దొరికినవి కావని టెంపూ కుటుంబ సభ్యులు తెలిపారు.
"అప్పటికే తయారుచేసి పెట్టుకున్న కేసులో అతనిపై తప్పుడు నేరారోపణ చేశారు," అని టెంపూ భార్య, 35 ఏళ్ళ వయసున్న గుణా దేవి చెప్పారు.
ప్రత్యక్షసాక్షులుగా చెప్తోన్న ఎవరి సాక్ష్యం మీద టెంపూను నేరస్థుడిగా నిర్ధారించారో, ఆ ఐదుగురూ పోలీసులు కావటం గుణా దేవి చెప్తున్నదానికి బలాన్నిస్తోంది. సాధారణ వ్యక్తులనెవరినీ ఈ కేసులో సాక్షులుగా విచారించలేదు. టెంపూను బిహార్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ (అమెండ్మెంట్) చట్టం, 2016 కింద విచారించారు.
"ఆ మద్యం మా ఇంటి వెనుకనున్న ఒక పొలంలో దొరికింది. ఆ భూమి సొంతదారులెవరో మాకు తెలియదు. వాళ్ళు పట్టుకున్న మద్యంతో మాకు ఎటువంటి సంబంధమూ లేదని నేను పోలీసులతో చెప్పాను," అన్నారు గుణా దేవి. కానీ వాళ్ళు ఆమె మాటలను వినిపించుకోలేదు. "తోరా ఘర్ కె పీఛే (దారూ) హవ్, త తోరే నా హోతవ్ (నీ ఇంటివెనుక దొరికిన మద్యం నీది కాక ఇంకెవరిది అవుతుంది?)." ఆమె వేడుకోళ్ళను తోసిపారేస్తూ పోలీసులు అన్నారు.
టెంపూ మాంఝీని 2019లో జైల్లోకి తోశారు. మూడేళ్ళ తర్వాత, మార్చ్ 25, 2022న ఇంటివద్ద మద్యాన్ని తయారుచేసి అమ్మిన నేరానికి గాను ఆయనకు ఐదేళ్ళ కఠిన జైలు శిక్ష, ఒక లక్ష రూపాయల జరిమానా విధించారు.
ముసహర్ సముదాయానికి చెందిన టెంపూ మాంఝీ, గుణా దేవి తమ నలుగురు పిల్లలతో కలిసి జహానాబాద్ జిల్లా, కెనారీ గ్రామంలోని ముసహర్ టోలీ (పల్లె)లో ఒక ఒంటిగది ఇంటిలో నివసిస్తుంటారు. తమ ఇంటిపై దాడి జరిగిన మార్చి 20, 2019 నాడు టెంపూ ఇంట్లో లేరు. అతను పొద్దుపొద్దున్నే, పొలంలోని పంటను ఎత్తి రైతు ఇంటికి చేరవేసే పనిలో కళాశీ (సహాయకుడు)గా పనిచేసేందుకు ఇంట్లోంచి వెళ్ళిపోయారు.












