చంపా వట్టి బిడ్డను ఒక కోతి దాదాపుగా ఎత్తుకుపోయింది. ఈ సంఘటన ఆమె తన గ్రామం రాజ్‌పూర్‌కు దగ్గరలో ఉండే అడవికి వెళ్ళినప్పుడు జరిగింది. ఈ మధ్యనే తల్లి అయిన ఆమె, తన బిడ్డను వీపుకు కట్టుకొని, రాబోయే వారపు హాట్ (సంత)లో అమ్మటం కోసం మహువా, సాల్ గింజలను సేకరించేందుకు అడవికి వెళ్ళింది.
"నేను వాడిని ఒక్క క్షణం పాటు నేలపై పడుకోబెట్టి పనిలోకి వెళ్ళాను," అని ఆమె గుర్తుచేసుకుంది, "ఇంతలో ఒక కోతి నా బిడ్డను ఎత్తుకుపోయే ప్రయత్నం చేయటాన్ని చూశాను." ఈ సంఘటన ఆమెను అడవికి వెళ్ళినప్పుడల్లా తన భద్రత గురించి ఆందోళన పడేలా చేసింది.
కానీ ఇప్పుడు ఆమెకు తన పసిబిడ్డను తనతోపాటు అడవిలోకి తీసుకువెళ్ళాల్సిన అవసరం ఎంతమాత్రం లేదు. గ్రామీణ ఛత్తీస్‌గఢ్‌లోని చంపా వంటి పసిబిడ్డల, చిన్నపిల్లల తల్లులు తమ పిల్లలను పగటివేళల్లో సమీపంలోని లైకాఘర్ లేదా శిశు సంరక్షక కేంద్రాలలో వదిలిపెట్టి జీవనోపాధిని సంపాదించుకోవడానికి వెళ్ళవచ్చు. ఇక్కడ ఏడు నెలల నుంచి మూడేళ్ళ వరకూ వయసుండే చంటి బిడ్డల సంరక్షణను చూసుకుంటారు.


















