నామ్‌దేవ్ భాంగ్రే జనవరి 25న అనిశ్చితితోనూ, వ్యాకులతతోనూ నిరసన ప్రదర్శనను ప్రారంభించారు. మూడు రోజుల తర్వాత అతను - ప్రధానంగా నాశిక్, అహిల్యానగర్ (గతంలో అహ్మద్‌నగర్) నుండి వచ్చిన పదివేల మంది ఆదివాసీ రైతులతో పాటు - గొప్ప ఆశతో ఇంటికి తిరిగి వచ్చారు.
అహిల్యానగర్ జిల్లా, ఖడ్కీ బుద్రుక్ గ్రామంలో నివసించే, మహాదేవ్ కోళీ ఆదివాసీ సముదాయానికి చెందిన భాంగ్రే కుటుంబం, అకోలే తాలూకాలో ఆరు ఎకరాల అటవీ భూమిని తరతరాలుగా సాగు చేస్తోంది. కానీ, మహారాష్ట్రలోని వేలాదిమంది ఇతర ఆదివాసులకు మాదిరిగానే, వారు సాగు చేస్తోన్న ఆ భూమిపై వారికెన్నడూ యాజమాన్య హక్కులు లేవు.
“మా తాతల కాలం నుండి మేం వరి, రాగులు పండిస్తున్నాం,” చెప్పారతను. “కానీ మాకు ఎన్నడూ భద్రత లేదు. మమ్మల్ని ఎప్పుడైనా ఇక్కడి నుండి ఖాళీ చేయించవచ్చనే నిరంతర భయంతో ఉంటాం.”
ఆ తీవ్రమైన అభద్రతను తగ్గించడానికి 2006లో భారత ప్రభుత్వం ఒక మైలురాయి అటవీ హక్కుల చట్టం (FRA)ను ఆమోదించింది. ఏళ్ళ తరబడి జరిగిన పోరాటం తర్వాత ఇది చట్టంగా మారింది. ఇది షెడ్యూల్డ్ తెగలకు, ఆయా ప్రాంతాలలో తరతరాలుగా నివసిస్తోన్న ఇతర సంప్రదాయ అటవీ నివాసులకు అటవీ భూమిపై, వనరులపై హక్కులను సంక్రమింపజేస్తుంది. గ్రామసభలు హక్కుల కోసం అడగటం ప్రారంభిస్తాయి, సబ్-డివిజనల్, జిల్లా కమిటీల ద్వారా వాటిని ధృవీకరించి, వారి హక్కులు పరిష్కారమయ్యే వరకు నివాసితులను తొలగింపునకు గురికాకుండా కాపాడుతాయి.
అయితే, క్షేత్రస్థాయిలో ఈ చట్టం అమలు తీరుపై అనుమానాలు కొనసాగుతున్నాయి.






