"మా సముదాయంలో ఎవరైనా వెదురుతో పర్రా [వస్తువులను ఎండబెట్టడానికి ఉపయోగించే చదునుగా ఉండే పళ్ళెం]ని గానీ సూపా [తూర్పారబట్టే చేట]ని గానీ తయారుచేస్తే, వారు ఇతర సమూహానికి తిండి గింజలు లేదా డబ్బు రూపంలో జరిమానా చెల్లించాల్సి ఉంటుంది." ఇక్కడ మంగలీ బాయి బింఝ్వార్, నహార్, నరోటియా, భరోటియా, రాయ్ మైనా, కాఠ్ మైనా వంటి బైగా ఆదివాసీ సముదాయాల ఉప సమూహాలు అనుసరించే జీవనోపాధి నియమం గురించి వివరిస్తున్నారు. మధ్యప్రదేశ్లోని బైగాలు ప్రత్యేకించి హానికి గురయ్యే ఆదివాసీ సమూహాలకు (PVGTలు) చెందినవారు. "ప్రతి సముదాయం వెదురుతో విభిన్నమైన వస్తువులను తయారుచేస్తుంది.”
స్వయంగా బింఝ్వార్ బైగా ఆదివాసి అయిన ఆమె, బాలాఘాట్ జిల్లాలోని నాటా గ్రామంలో 10 నుండి 12 ఆదివాసీ కుటుంబాలు నివసించే పండా టోలాలో నివసిస్తున్నారు. అది శుక్రవారం ఉదయం. మంగలీ బాయి తన సముదాయానికే చెందిన ఇతరులతో కలిసి, వెదురు తీసుకురావడానికి మల్ధర్ గ్రామం సమీపంలోని అటవీ ప్రాంతానికి వెళుతున్నారు. వారు మామూలుగా వెళ్ళే సమయమైన ఉదయం 4 గంటల కంటే ఈ రోజు కొంచెం ఆలస్యమైంది, కానీ సూర్యోదయానికి ముందునుంచే వారు నాకోసం వేచి ఉన్నారు.
దారిలో వారు తమ భోజనం డబ్బాలను ఒక ఎండిపోయిన నదీతలం అడుగున దాచిపెట్టి, ఒక్కొక్కరు ఒక నీటి సీసా, ఒక గొడ్డలిని మాత్రమే మోసుకుంటూ నడుస్తున్నారు. "ఇది మేం మోసే బరువును తగ్గించుకోవడానికి ఒక మార్గం," మంగలీ బాయి చెప్పారు. మధ్యాహ్నం దాటిన తర్వాత వారు తిరిగి పండా టోలా వైపు 8 నుండి 10 కిలోమీటర్ల దూరం నడుస్తారు. వారు తమ తలపై దాదాపు 25 కిలోల బరువుండే మూడు నుండి నాలుగు వెదురు కర్రలను మోస్తారు.






































