స్త్రీలకు, పురుషులకు వేసే పచ్చబొట్లు ఎప్పుడూ భిన్నంగానే ఉంటాయి. స్త్రీలు తమ జీవితంలోని వివిధ దశలలో - యుక్తవయస్సుకు చేరుకునే సందర్భంగా, వివాహం చేసుకున్న తర్వాత - పచ్చబొట్లు వేయించుకుంటారు. వారి పచ్చబొట్లలో కొన్ని కుటుంబంలోని పురుష సభ్యుల విజయాల జ్ఞాపకార్థంగా కూడా ఉంటాయి.
“ఒక కొన్యాక్ మహిళ జీవితం అనేక మార్పులకు లోనవుతుంది. తన తండ్రి గోత్రంలో పుట్టిన ఆమె, మరొక గోత్రంలో వివాహం చేసుకుంటుంది. అయినప్పటికీ, పెళ్ళికి ముందు ఆమె వేయించుకున్న పచ్చబొట్టు మాత్రమే జీవితాంతం, చివరకు మరణానంతరం కూడా ఆమెతో పాటు ఉండే ఏకైక విషయం. అది ఎప్పటికీ మారని ఒకే ఒక్క గుర్తు, అది ఆమె ఎవరో, ఎక్కడి నుండి వచ్చిందో తెలియజేసే గుర్తు,” అని అమో కొన్యాక్ అంటారు.
మొన్ నివాసి అయిన ఆమె తన తాతయ్య, నానమ్మల మీద పచ్చబొట్లు చూసిన సంగతిని గుర్తు చేసుకున్నారు. “నా చిన్నతనంలో నేను పచ్చబొట్ల గురించి, వాటిని ఎలా వేస్తారో, అది ఎంత బాధాకరంగా ఉంటుందో, వేయించుకున్న తర్వాత జనం ఎంత గర్వంగా భావిస్తారో అనే కథలను తరచుగా వినేదాన్ని. ఎప్పుడూ భక్తిపూర్వక గౌరవంతో చెప్పే ఈ కథలను జానపద కథల మాదిరిగా తరతరాలుగా చెప్తూవచ్చారు. నాకు, ఈ పచ్చబొట్లు కేవలం వారి చర్మంపైనే కాకుండా, వారి అస్తిత్వపు మూలాల్లోకి చెక్కబడిన జ్ఞాపకాల పటాలలా అనిపించేవి,” అని ఆ 32 ఏళ్ళ పరిశోధకురాలు ఎంతో ప్రేమగా చెప్పారు.
కొన్యాక్ ప్రజలు సంప్రదాయకంగా తలలను వేటాడేవారు. యుద్ధంలో విజయం సాధించిన తర్వాత ఆ విజయాన్ని సూచించడానికి పురుషుల చర్మంపై పచ్చబొట్లు చెక్కేవారు. ఈ అంశంపైనే దృష్టి పెట్టడం వల్ల కొన్యాక్ పచ్చబొట్ల గురించి చేసిన పరిశోధనలు, కథనాల నుండి మహిళలు తరచుగా విస్మరించబడ్డారని అమో చెబుతున్నారు. ఆమె తన అమ్మమ్మ చెప్పిన పచ్చబొట్ల కథలను గుర్తు చేసుకుంటూ, “ఆ ప్రక్రియ ఎంత బాధాకరంగా ఉండేదో, చర్మం ఎంతలా రక్తస్రావమై వాచిపోయేదో, అయినప్పటికీ ఆ తర్వాత తాను ఎంత గర్వంగానూ, అందంగానూ భావించేదో ఆమె నాకు తరచుగా చెప్పేది,” అన్నారు.
అదే గ్రామంలో చాలా కొద్దిదూరంలోనే ప్రస్తుతం డెబ్బైల వయసులో ఉన్న గొన్ఫే ఉంటున్నారు. ఆమె తన అక్క దగ్గర, బంధువుల నుండి పచ్చబొట్టు వేసే కళను నేర్చుకున్నారు, వీరు కూడా ఈ కళను తమ తల్లుల నుండి నేర్చుకున్నవారే. అయితే, ఆమెకు ఎప్పుడూ ఈ కళను ఆచరణలో పెట్టే అవకాశం లభించలేదు ఎందుకంటే అది 'రాణి'కి - మొదటి భార్యకు - మాత్రమే దక్కే ప్రత్యేక హక్కు. పచ్చబొట్టు వేయటంలో గొన్ఫే 'రాణి'కి సహాయం - వేసేవారి కోసం ముళ్ళను సేకరించి, వేయించుకుంటున్నవారు నొప్పితో ఎక్కువగా కదలకుండా ఉండేలా వారిని పట్టుకోవటం - చేసేవారు. ఇదంతా చెప్తున్నపుడు గొన్ఫే ముఖం చిట్లిస్తూ, నొప్పిని అభినయించారు. ఆ తర్వాత ఇప్పుడు పాతవైపోయిన ఆ జ్ఞాపకాలను తలచుకొని నవ్వుతారు.
PARI ఆమెను కలవడానికి వెళ్ళినప్పుడు, ఆమె అంఘ్ ప్రాంగణంలో ఉన్న అనేక వెదురు గుడిసెలలో ఒకదానిలో కూర్చొని ఉన్నారు. ఆమె చాలా నెమ్మదిగా మాట్లాడతారు, పండుగ ప్రాంగణం నుండి బిగ్గరగా వినవస్తోన్న హర్షధ్వానాల మధ్య కొన్నిసార్లు ఆమె గొంతు వినిపించకుండా పోతోంది. మేం ఆమె ఫోటోలు తీయడానికి అనుమతి కోరినప్పుడు, ఆమె సంతోషంగా లేచి, మరింత లాంఛనప్రాయమైన సంప్రదాయ దుస్తులను, ఆభరణాలను ధరించేందుకు వెళ్ళారు.