ప్రతి ఉదయం ఆకిఫ్ ఎస్.కె. హేస్టింగ్స్లోని ఒక వంతెన కింద ఉండే తన నివాసమైన ఝోప్డీ (గుడిసెవంటి తాత్కాలిక నిర్మాణం)ని వదిలి కొల్కతాలోని ప్రముఖ పర్యాటక ఆకర్షణ అయిన విక్టోరియా మెమోరియల్కి వెళ్తాడు. దారిలో అతను రాణి, బిజిలీలను కూడా తనతోపాటు తీసుకువెళ్తాడు.
రాణి, బిజిలీ అని అతను పేర్లు పెట్టుకున్న ఆ రెండు తెల్ల గుర్రాలే ఈ శీతాకాలంలో అతనికి జీవనోపాధి. "అమీ గాడీ చలాయ్ (నేను బగ్గీని నడుపుతాను)," అంటాడు ఆకిఫ్. అతను హేస్టింగ్స్కు దగ్గరలోని గుర్రాలదొడ్డిలో తన గుర్రాలను కట్టేసి ఉంచి, ఉదయం 10 గంటల సమయమప్పుడు వాటిని విక్టోరియా - సెంట్రల్ కొల్కతాలో చుట్టూ బహిరంగ మైదానం ఉన్న ఈ పాలరాతి భవనాన్ని స్థానికులు పిలిచే పేరు - దగ్గరకు తెస్తాడు. బ్రిటిష్ చక్రవర్తిని విక్టోరియా రాణి జ్ఞాపకార్థంగా కట్టిన ఈ ప్రదేశాన్ని 1921లో ప్రజలు సందర్శించేందుకు తెరిచారు.
ఆకిఫ్ ప్రతిరోజూ అద్దెకు తీసుకునే బగ్గీ, విక్టోరియా మెమోరియల్ వద్ద విస్తరించివున్న క్వీన్స్ వే అనే ప్రదేశంలో నిలిపి ఉంటుంది. వరుసగా నిలిచివున్న 10 బగ్గీలలోంచి తన బగ్గీని చూపిస్తూ "ఆ బంగారు రంగుది నాదే," చెప్పాడు ఆకిఫ్. అక్కడ నిలిపివున్న చాలా బగ్గీలు ఒకే రంగులో ఉండి, అనేక పూల, పక్షుల బొమ్మలతో అలంకరించి రాజ రథాలలాగా కనిపిస్తున్నప్పటికీ, మెరిసిపోయే ఆకిఫ్ బగ్గీ వాటిలో ప్రత్యేకంగా నిలుస్తోంది. బ్రిటిష్ రాజ్ కాలం నాటి జీవితపు ఛాయలు చూడాలనుకునేవారికోసం అతను ప్రతిరోజూ దాదాపు రెండు గంటల పాటు తన బగ్గీని శుభ్రంచేసి, మెరుగుపెడతాడు.
అప్పటికే వీధిలో విక్టోరియా మెమోరియల్ గేట్ల దగ్గర ఒక చిన్న గుంపు పోగైవుంది. "పాత రోజుల్లో ఇక్కడ రాజులు నివాసముండేవారు, బగ్గీల మీద ఈ చుట్టూ తిరుగుతుండేవారు. ప్రస్తుతం జనం ఆ రోజుల అనుభూతిని పొందటానికి విక్టోరియాను చూసేందుకు వస్తారు," 2017 నుంచి బగ్గీని తోలటం ప్రారంభించిన ఆకిఫ్ చెప్పాడు. "ఎంతకాలం విక్టోరియా [మెమోరియల్] ఉంటే అంతకాలం ఈ గుర్రపు బగ్గీలు కూడా ఉంటాయి." అదేవిధంగా అతని వంటి బగ్గీలు తోలేవారికి పని కూడా ఉంటుంది. ప్రస్తుతం ఇక్కడ సుమారు 50 బగ్గీల వరకూ నడుస్తున్నాయి.
శీతాకాలం వచ్చింది. తన రోజును ఆరుబయట గడిపేందుకు కొల్కతా నగరం ఆయత్తమవుతోన్న సమయాన ఆకిఫ్ తీరికలేకుండా ఉంటాడు, ముఖ్యంగా సాయంత్రం వేళల్లో. ఈ సీజన్ నవంబర్ నుండి ఫిబ్రవరి వరకు ఉంటుంది. ఆ తర్వాత వాతావరణం చాలా వేడిగా ఉంటుంది కాబట్టి చాలా తక్కువమంది జనం ఆరుబయట సవారీలకు వస్తారని అతను చెప్పాడు











