నిప్పుల పొగతో, వేగుతోన్న జొన్న పరిమళంతో గాలి నిండిపోయింది. హుర్డా సంబరాలు జరుగుతున్నాయి! హుర్డా అని పిలిచే తాజాగా కోసిన లేత జొన్న కంకులు రుచికి ప్రసిద్ధిచెందినవి. రైతులు తాము కోసిన పంటను తీసుకువచ్చి, మరఠ్వాడా వ్యాప్తంగా గ్రామాలలోనూ పట్టణాలలోనూ దుకాణాలు తెరిచారు.
"జనం వీటికోసం చాలా ఆతృతగా ఎదురుచూస్తారు," లోంఢ్యాచీవాడీకి చెందిన జొన్న రైతు సూర్యకాంత్ మైంద్ అన్నారు. జాల్నా జిల్లాలో తనకున్న ఐదు ఎకరాల భూమిలో ఆయన బేద్రి, మాల్దండీ రకాల జొన్నలను విత్తుతారు. పంట ఇంకా లేతగా ఉండగానే ఆ కుటుంబం డిసెంబర్ నెలలో వేసిన పంటలో సగాన్ని కోస్తారు, మిగిలిన సగాన్ని పంట పూర్తిగా పక్వానికి వచ్చాక ఫిబ్రవరి, మార్చి నెలల్లో కోస్తారు.
జాగ్రత్తగా కోసిన తన లేత జొన్న పంట (హుర్డా)తో మైంద్ జాల్నా నగరానికి వెళ్తారు. ఈ సీజన్ మొత్తమ్మీద కిలో ఒక్కింటికి రూ. 150 చొప్పున 40 కిలోల లేత జొన్న కంకులను అమ్ముతానని ఈ 55 ఏళ్ళ వయసున్న రైతు చెప్పారు.
దుకాణాల దగ్గర హుర్డా తయారుచేయటం ఒక నెమ్మదైన, సావధానమైన ప్రక్రియ, ఇందులో మహిళలదే ప్రధాన పాత్ర. ఒక గుంటలో అంతకుముందరి పంటకు చెందిన కొన్ని ఎండిన జొన్న దంట్లతో మంట పెట్టి, ఆ మంటలో లేత జొన్న కంకులను తంపట వేస్తారు. కంకులు సమంగా వేగడానికి, అవి మాడిపోకుండా ఉండేందుకు పొడవైన కర్ర ముక్కలతో కంకులను అటూ ఇటూ తిప్పుతారు. ఇందులో సమయం చాలా కీలకమైనది. “త్వరత్వరగా తీసేస్తే, అది సరిగ్గా కాలక పచ్చిగా ఉంటుంది; ఎక్కువసేపు అలాగే వదిలేస్తే, అది మాడిపోతుంది,” అని ఛత్రపతి సంభాజీనగర్ (గతంలో ఔరంగాబాద్) జిల్లాకు చెందిన 45 ఏళ్ళ రైతు భీమా నానా దఖనే వివరిస్తున్నారు.
కంకులు సమపాళంగా కాలగానే వాటి పొట్టును తొలగించటానికి మహిళలు వాటిని తమ అరచేతుల మధ్య ఉంచుకొని నలుస్తారు. అప్పుడిక వంట మొదలవుతుంది. "పొద్దున్నించి సాయంత్రం పొద్దుగుంకే వరకూ ఇతర మహిళలతో కలిసి నేను వంటగదిలో ఉంటాను," అంటారు సవితా దఖనే. "నేరుగా పొలం నుండి పళ్ళెంలోకి వడ్డిస్తున్నందుకు మాకు కాస్త గర్వంగానే ఉంటుంది."














