సువాసన వెదజల్లుతూ, మీగడ తెలుపు, పసుపు రంగుల్లో ఉన్న కఠ్గొలాప్ (ఫ్రాంజిపానీ లేదా ప్లూమేరియా రుబ్రా - దేవగన్నేరు) పూలతో పొడవైన దండ అల్లుతున్నారు చంద్రమ. ఆవిడ సింగారించుకున్న మూడు బంగారు ముక్కుపోగుల ప్రకాశం ముందు ఈ ఏప్రిల్ నెల మధ్యాహ్నవేళ తీక్షణంగా మండుతోన్న పసుపు రంగు సూర్యుడు, ఆమె చేతుల్లోని అందమైన దేవగన్నేరు పువ్వు మధ్యనున్న ముదురు పసుపు రంగు వెలవెలబోతున్నాయి. ఒడిశాలోని కోరాపుట్ జిల్లా, పూత్పొందీ గ్రామ శివార్లలో ఉన్న ఒక బయలు ప్రదేశంలో, ఆమెతో పాటు గదబ ఆదివాసీ సముదాయానికి చెందిన మరో ఇరవైమంది మహిళలు పూలదండలు అల్లడంలో నిమగ్నమై ఉన్నారు. వాళ్ళందరూ రెండు లేదా మూడు ముక్కుపోగులు పెట్టుకొనివున్నారు.
“ఈ కుడివైపున పెట్టుకున్నదాన్ని బేస్రి (బేసరి) అంటాం. మధ్యలో ఉన్నది దోందీ (బులాకీ). ఎడమవైపు ఉన్నది నత్తో (నత్తు). నేను వీటిని ఎప్పటినుండో పెట్టుకుంటున్నాను. బహుశా, వీటితోనే పుట్టినట్టున్నాను,” నవ్వుతూ అన్నారు 70 ఏళ్ళ చంద్రమ గదబ. ఆమె మాట్లాడుతున్నప్పుడు, ముక్కు దూలం చివర వేలాడుతోన్న బులాకీ కొంచెం పైకి లేవడంతో, అందాకా ఆ బంగారు బులాకీకి ఉన్న మువ్వల కింద దాగివున్న ఆమె కింది పెదవి కనిపించింది.
“ఒకప్పుడు మా గదబ తెగలో అమ్మాయిలు పసిపిల్లలుగా ఉన్నప్పుడే ఈ మూడు రకాల ముక్కుపోగులను పెట్టుకునేలా చేసేవారు. కానీ ఇప్పుడు ఐదు, పది సంవత్సరాలు నిండాక మాత్రమే ముక్కు కుట్టించుకుంటున్నారు. కొన్నిసార్లు, అమాయిలు ముక్కు కుట్టుంచుకోవడానికి ఇష్టపడటమే లేదు,” ఆమె తెలిపారు. మాట్లాడే ప్రతి మాటతో పాటు, ఆవిడ తన చురుకైన వేళ్ళతో తాజాగా కోసిన కొన్ని పువ్వులను దండగా అల్లుతున్నారు. ఆ సాయంత్రం, వేటకి వెళ్ళిన మగవాళ్ళు ఇంటికి తిరిగి రాగానే, ఆడవాళ్ళు ఈ పూలదండలతో వాళ్ళకి స్వాగతం పలుకుతారు. ఇదే చైత్ పరబ్ (చైత్ర పర్వ అని కూడా పిలుస్తారు).
ఒడిశా, ఝార్ఖండ్లలోని అనేక ఆదివాసీ తెగలు జరుపుకునే 14 రోజుల వ్యవసాయ పండుగే చైత్ పరబ్. హిందూ క్యాలెండర్లో మొదటి నెల అయిన చైత్రమాస ప్రారంభాన్ని ఇది సూచిస్తుంది. ఈ పండుగను ఏప్రిల్ మధ్యలో జరుపుకుంటారు. సంప్రదాయకంగా ఇది పొలం పనుల నుండి విశ్రాంతి తీసుకునే సమయం కూడా. గాలి మొత్తం వేసవి పాటలతో, వేసవికాలంలో విరివిగా దొరికే పండ్ల, పూల పరిమళాలతో నిండిపోయే సమయం. ఈ పండుగలో భాగంగా, గదబ సముదాయంలోని యువతులు, వృద్ధ మహిళలు పాటలు పాడతారు, నాట్యం చేస్తారు, తాగుతారు, గ్రామ దేవతలకు పచ్చి మామిడికాయలను సమర్పిస్తారు. అలాగే, వేట నుండి ఇంటికి తిరిగివచ్చే మగవాళ్ళను స్వాగతించడానికి దండలు అల్లుతారు.








