దూలేశ్వరి సోరెన్ రేషన్ కార్డు మీద ఆమె పుట్టిన తేదీ 1963, జనవరి 1 అని వుంది. కానీ బక్కచిక్కి, ముసలిదైపోయిన ఈ సంతాల్ ఆదివాసీ నిజానికి అంతకంటే దశాబ్దాలు పెద్దదిగా కనిపిస్తున్నారు. “ఆమెకు దాదాపు 100 ఏళ్ళు వుంటాయి,” అంటుంది ఆమె మునిమనవరాలు ప్రమీల కిస్కు. ప్రమీలకు సుమారు 16 ఏళ్ళుంటాయి.
తొంభైయిలలో వున్న ఆ వృద్ధురాలి ఇంటి ముందు మేమంతా కూర్చొని ఉన్నాం. పశ్చిమ బెంగాల్లోని శాంతినికేతన్ పరిసరాల్లోని బాగాన్ పారాలో ఆమె ఇల్లు ఉంది. అక్కడి సందుల గొందుల వీధుల్లో వీధి కుక్కలూ, పెంపుడు కోళ్ళూ తిరిగే చోటు కోసం ఒకదానితో ఒకటి పోటీ పడుతున్నాయి. కుక్కలు బద్దకంగా పొర్లాడుతుంటే, కోళ్ళు మాత్రం నేలను పొడుస్తూ హడావుడిగా వున్నాయి. “శాంతి నికేతన్... ఆమార్ నాతనిర్ నామ్ [శాంతినికేతన్... అది మా మనవరాలి పేరు],” దూలేశ్వరి గొంతు వణుకుతోంది. పొట్టిగా కత్తిరించిన నెరిసిన జుట్టులోకి వేళ్ళు జొనుపుతూ చిరునవ్వులు చిందించారామె.
“ఉకూన్ హొయెచ్ఛిలో [నాకు పేలు ఉండేవి] చెప్పారామె. “నా దగ్గర కూర్చొని వాటిని ఏరటానికి ఎవరికి తీరుతుంది? అందుకే నా జుట్టును గొరిగించింది,” ఇంకా నవ్వుతూనే తన పక్కన కూర్చొని ఉన్న ప్రమీల వైపు చూపించారు దూలేశ్వరి. “ఆమె [ప్రమీల] నాకు రోజూ ఒక కప్పు టీ ఇస్తుంది. నా గోళ్ళు కత్తిరిస్తుంది,” మురిపంగా చెప్పారు దూలేశ్వరి.








