"ఈ విందును గ్యాస్‌పై వండాలని మేం అనుకున్నాం," దగ్గరలోనే ఆరిపోతున్న నిప్పుకణికలను నిమ్మళంగా చూస్తూ అన్నారు రియాజ్ అహ్మద్. "కానీ గ్యాస్ కొరత కారణంగా నేను కట్టెలకు మారాను. దీనివల్ల మాకు దాదాపు రెట్టింపు ఖర్చవుతోంది."
50 ఏళ్ళ రియాజ్ అహ్మద్ అంచారి సంప్రదాయ కశ్మీరీ వంట మాస్టారైన ఒక వాజా. వాస్తవానికి, ఇక్కడ తన స్నేహితుడి సోదరి వివాహ వేడుకలో ప్రధాన వాజాగా వ్యవహరిస్తోన్న ఆయన, ఇప్పటివరకు ఎన్నడూ ఊహించని ఒక సమస్యతో ఇప్పుడు సతమతమవుతున్నారు.
అక్కడికి సుమారు 3,000 కిలోమీటర్ల దూరంలో ఉండే ఇరాన్లో జరుగుతోన్న యుద్ధం కశ్మీర్‌లోని పెళ్ళిళ్ళకు ఆటంకాలు కలిగిస్తోంది.
అంతకుముందు, ఇల్లంతా సందడిగా అనిపించింది. కొందరు సంప్రదాయ పాటలు పాడుతుండగా, మరికొందరు నృత్యం చేస్తున్నారు, ఇంకొందరు అతిథులకు ఆతిథ్యం ఇస్తూ హడావిడిగా తిరుగుతున్నారు. ఇంటికి అలంకరించిన దీపాల దండలు ఆ రాత్రికి వెచ్చని రంగులు వేశాయి.
ఆ వాజాలు, వారి కథలు, తరతరాలుగా వస్తున్న వారి వంటల విధానాలు నాకెప్పుడూ ఎంతో అబ్బురంగా అనిపించేవి. అందుకే, రాత్రి సుమారు 11 గంటల సమయంలో, పెళ్ళి వంటలు పూర్తి చేసుకున్న ఆ వంట మాస్టర్ల పక్కనే నేను కూర్చుండిపోయాను.
ప్రతి ఒక్క వాజా అత్యంత నైపుణ్యం కలవారే. ఒకరు అద్భుతమైన కచ్చితత్వంతో మాంసాన్ని కోయడంలో నిపుణుడు. మరొకరు నెమ్మదిగా ఉడికించటంలోని సున్నితమైన సమయపాలనను అర్థం చేసుకుంటారు. ఇంకొకరికి మసాలాల గురించి దాదాపు సహజసిద్ధమైన జ్ఞానం ఉంటుంది, కేవలం ఒక్క చూపుతోనే ఒక వంటకంలో ఏ చవి లోపించిందో కచ్చితంగా చెప్పగలరు.











