తుకారామ్ మాసళ్ రెండు పెద్ద ప్లాస్తిక్ డబ్బాలను మోటార్ సైకిల్‌కు కట్టుకొని, తన ట్రాక్టర్ల కోసం డీజిల్ కొనేందుకు పట్టణానికి వెళ్ళారు. అయితే, ఆ వాహనాలనే నేరుగా అక్కడికి తీసుకెళ్ళవచ్చుకదా?
"దానివల్ల డబ్బూ, డీజిల్ రెండూ దండగే," అంటారు మాసళ్. ఒక ట్రాక్టర్ ఒక లీటర్ డీజిల్ మీద ఎక్కువలో ఎక్కువగా ఐదు కిలోమీటర్ల దూరం వెళ్తుంది. "ఇప్పుడు లీటర్ డీజిల్ ధర సుమారు వంద రూపాయలుంది." ఆ డీజిల్ కోసం ఆయన అనేక బంకులకు తిరగాల్సి ఉంటుంది కూడా.
డీజిల్‌పై నియంత్రణ మొదలైంది.
"ప్రతిసారీ వాళ్ళు మాకు కొన్ని లీటర్లు మాత్రమే ఇస్తున్నారు," అన్నారు వాక్వడ్ గ్రామానికి చెందిన 53 ఏళ్ళ రైతు మాసళ్. ఈ గ్రామం మహారాష్ట్రలోని కరువు పీడిత ధారాశివ్ జిల్లాలోని భూమ్ పట్టణానికి 25 కిలోమీటర్ల దూరంలో ఉంది.
"రోజు మొత్తంలో 20-25 లీటర్ల డీజిల్ కొనటం కోసం నేను ఐదు వేరు వేరు పెట్రోల్ పంపులకు వెళ్తాను," అన్నారాయన. భూమ్ పరిసర ప్రాంతాల్లో ఇంధన కేంద్రాలు చాలా దూరంగానూ, చాలా తక్కువగా కూడా ఉన్నాయి.
కొన్ని రోజుల్లో డీజిల్ కోసం అన్ని పంపులకూ తిరుగుతూ 70-80 కిలోమీటర్లు ప్రయాణిస్తారు మాసళ్. "ప్రతి రెండు మూడు రోజులకు ఒకసారి దొరికితే కూడా అదృష్టమే," అంటారతను. ఒక్కోసారి, ట్రాక్టర్లను పంపు వద్దకు తీసుకురావాల్సిందేనని పట్టుబట్టి, ప్లాస్టిక్ డబ్బాలలో డీజిల్ ఇవ్వడానికి పెట్రోల్ బంకులవాళ్ళు నిరాకరిస్తారు.











