డిసెంబర్ 2019లో, ఛత్రపతి సంభాజీనగర్‌కు చెందిన ఒక రవాణా సంస్థలో రెండు దశాబ్దాలుగా ట్రక్ డ్రైవర్‌గా పనిచేస్తున్న 50 ఏళ్ళ సుభాష్ బిక్కడ్, స్వయంగా వాహనాన్ని నడుపుకుంటూ ఒక ఎత్తైన హైవేపైకి వెళ్ళారు.
“నేనూ, నా ఇద్దరు స్నేహితులం కలిసి సొంతంగా ఒక రవాణా సంస్థను ప్రారంభించి మూడు ట్రక్కులను, కంటైనర్లను కొనుగోలు చేశాం. ఒకే గ్రామానికి చెందిన మేమందరం దేశమంతటా ట్రక్కులు నడిపాం. పుణేకు చెందిన మా స్నేహితుడొకరు హామీదారుగా ఉండి మాకు సహాయం చేశాడు.”
అది ఒక డ్రైవర్ స్థాయి నుండి యజమాని స్థాయికి ఎదిగే అద్భుతమైన ప్రయాణానికి నాంది పలికింది. ఇది కేవలం బిక్కడ్, అతని భాగస్వాములకే కాకుండా అతని సొంత ఊరైన సారణీ సాంగవీకి చెందిన 80 మంది యువకులకు కూడా వర్తించే విషయం. అంటే, 1,460 మంది జనాభా కలిగిన ఆ గ్రామంలో దాదాపు ప్రతి నాలుగవ కుటుంబం ట్రక్కింగ్ వ్యాపారంలో ఉందన్నమాట. సారణీ సాంగవీ కరువు పీడిత బీడ్ జిల్లా, కైజ్ తహసీల్‌లోని ఒక జంట గ్రామం.
2025 నాటికల్లా సారణీ సాంగవీ ట్రక్కుల, ట్రక్ కంటైనర్ల (వీటిని షిప్పింగ్ లేదా కార్గో కంటైనర్లు అని కూడా పిలుస్తారు) గ్రామంగా మారిపోయింది. ఆ 80 మంది వ్యక్తులు మొత్తం 400 ట్రక్కులకు, లోడింగ్ కంటైనర్లకు సొంతదార్లయ్యారు. దేశంలోని కొన్ని అతిపెద్ద రవాణా సంస్థలు వారికి పనులు అవుట్సోర్సింగ్ చేయడంతో వారి వ్యాపారం వేగంగా వృద్ధి చెందింది. చాలామంది ఒకరికొకరు ఇచ్చిన రుణ హామీలతో విజయానికి ఎగబాకారు. "మేం ట్రక్కులన్నిటికీ పొలాల్లో పూజ చేసి దీపావళి జరుపుకున్నాం," సర్పంచ్ సునీల్ కేదార్ PARIతో అన్నారు.
ట్రక్కు కంటైనర్ కొత్త గ్రామ దేవత అయింది.
కానీ ఈ రోజున ఆ ట్రక్కులు, కంటైనర్లలో చాలా వరకు గమ్యస్థానాల వద్దనో, కొన్ని దారుల్లోనో నిలిచిపోయాయి. గ్రామంలో అవి చాలా తక్కువ సంఖ్యలోనే మాకు కనిపించాయి. అనేక రకాల రహదారి సుంకాలు పెరగడం వంటి ఇతర కారణాల వల్ల అప్పటికే కొంత దెబ్బతిన్న సారణీ సాంగవీ ఆర్థిక శ్రేయస్సుకు, ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ జరిపిన యుద్ధం మరింత దెబ్బకొట్టింది.







