సుగుణ కథ
వణక్కమ్ (నమస్కారం)! నా పేరు సుగుణ. నేను 2008 నుండి ఈ పని చేస్తున్నాను. చాలా చిన్నతనంలోనే నా తల్లిదండ్రులను కోల్పోయాను.
నాన్న చనిపోయిన తరువాత, మా అమ్మ దగ్గర్లోని బొమ్మల కార్మాగారంలో పనిచేయడం మొదలుపెట్టింది. అమ్మ ఇంటికి బొమ్మలు తీసుకు వచ్చేది. అప్పుడే, నాకు వాటి పట్ల ఇష్టం మొదలైంది. నాకు నాలుగేళ్ళ వయసున్నప్పటి నుండి, నేను బడి కంటే బొమ్మల పట్లే ఎక్కువగా ఆకర్షితురాలినయ్యాను. వీటిని ఎలా తయారుచేస్తారు? దేనితో తయారుచేస్తారు అని ఆశ్చర్యపోయేదాన్ని.
అమ్మ చనిపోయినప్పుడు మా అవ్వ, ‘ఇక నువ్వు బడికి వెళ్ళడం కుదరదు. నేను నిన్ను పోషించలేను,’ అని చెప్పింది. అక్కతో పాటు నన్నూ అదే కర్మాగారంలో పనికి పంపేది. అప్పుడు నాకు పదేళ్ళు.
మొదట్లో, మట్టిని కలిపి జల్లెడ పట్టడానికి మాత్రమే నాకు అనుమతి ఉండేది — బొమ్మలను ముట్టుకోనిచ్చేవారు కాదు. రెండేళ్ళ తరువాత, అచ్చుల్లో మట్టిని పోయటం మొదలుపెట్టాను. నెమ్మదిగా నేను కూడా పోతపని నేర్చుకున్నాను. కొంతకాలం తరువాత, ఇందులో మరింత రాణించాలనిపించింది. అప్పుడే నేను ఈ కళను నేర్చుకోవాలని నిర్ణయించుకున్నాను.
ఇది నేర్చుకోవడానికి నాకు నాలుగేళ్ళు పట్టింది. నాకు 14 ఏళ్ళ వయసప్పుడు నేర్చుకోవడం మొదలుపెట్టి, రోజుకు రూ. 75 సంపాదించేదాన్ని. కళాకారులు రూ.100 సంపాదించేవారు. నేనూ అంత ఇవ్వమని అడిగినప్పుడు, ‘నువ్వింకా చిన్నదానివి,’ అనేవారు. దాంతో, నేను అక్కడ పని మానేశాను.
తరువాత, నేను కాంట్రాక్ట్ పనులు చేపట్టాను — కళాకృతుల కోసం ఒక 10 కంపెనీల నుంచి నాకు ఆర్డర్లు వచ్చాయి. అప్పుడే, మనం ఎప్పటికప్పుడు మన నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటే, మన పనే మన ఎదుగుదలకి కారణమవుతుందని గ్రహించాను.
నెమ్మదిగా జనం నన్ను గౌరవించడం మొదలుపెట్టారు. ఆ రోజుల్లో కళాకారులు మాత్రమే మేజాల వద్ద కూర్చునేవారు. మిగతావాళ్ళు నేల మీద. ఒకప్పుడు నన్ను తోసేసిన వ్యక్తులే నన్ను తిరిగి పనిలో చేరమని అడగడం మొదలుపెట్టారు. బొమ్మల తయారీలో కళ్ళను, పెదవులను, కొన్ని చిన్న చిన్న వివరాలను తీర్చిదిద్దటమే నా పనిని ప్రత్యేకంగా నిలబెట్టింది.
కానీ కొన్ని ప్రదేశాలు భరించరానివిగా ఉంటాయి. వాళ్ళు స్త్రీలను చూసే విధానం, మమ్మల్ని ఎగతాళి చేసే విధానం - ఇచ్చే జీతం ఎంతైనా సరే, నేను తిరిగి అక్కడకు పనికి వెళ్ళడానికి నిరాకరించేదాన్ని.
అలాంటి ఒక కర్మాగారంలోనే నేను నా భర్తను కలిశాను. అతను విదేశాలకు వెళ్ళాలనుకున్నాడు, కానీ ‘మనం పెళ్ళి చేసుకుంటే, నువ్వు ఇక్కడే ఉండి నాతో కలిసి ఈ కంపెనీని నడపాలి,’ అని అతనితో అన్నాను. అదే నేను పెట్టిన ఏకైక షరతు.
నాకు ఈ పని అంటే ఎందుకంత ఇష్టం? బహుశా, అది మట్టి కావటం వల్ల కావచ్చు — నేను దానికి ఒక ఆకృతినిస్తాను, ప్రాణం పోస్తాను, ప్రజలు దాన్ని ఆరాధిస్తారు. ఇందులో ఉండే సంతోషమే నన్ను ముందుకు నడిపిస్తోంది.