"ఎడమవైపు మొదటి మలుపును తీసుకోండి. ఇంకొంచం దిగువకు పోతే ఒక నల్లని స్తంభం మీద మీకు ఫౌజీ ఫోటో కనిపిస్తుంది. అదే ఇల్లు." రామ్‌గఢ్ సర్దారాఁలోని ఆ పెద్దవయసు సైకిల్ మెకానిక్, వీధి చివరన ఉన్న మలుపు వైపు చూపిస్తూ చెప్పారు. గ్రామప్రజలు అజయ్ కుమార్‌ను ఫౌజీ (సైనికుడు), లేదా అమరవీరుడు అని పిలుస్తారు.
భారత ప్రభుత్వం దృష్టిలో, అతను ఆ రెండింటిలో ఏదీ కాదు.
ఆ 23 ఏళ్ళ యువకుడు జమ్మూ కశ్మీర్ తిరుగుబాటు వ్యతిరేక కార్యకలాపాలలో తన రక్తం చివరి చుక్క వరకూ ధారపోసి ఈ దేశ సరిహద్దులను రక్షించాడు. దళితులూ, భూమిలేని, వృద్ధులైన అతని తల్లిదండ్రులు తమ కుమారుడి పింఛను గురించి, అమరవీరుని హోదా గురించీ కలలో కూడా ఊహించలేరు. మాజీ సైనికుల సహాయక ఆరోగ్య పథకం కింద ఎలాంటి ప్రయోజనాలకు, క్యాంటీన్ స్టోర్స్ డిపార్ట్మెంట్ డిస్కౌంటులకు కూడా వారు అర్హులు కాదు. అధికారిక రికార్డులలో, అజయ్ కుమార్ సైనికుడు, లేదా అమరవీరుడు కాదు.
అతను కేవలం ఒక అగ్నివీర్ మాత్రమే.
లుధియాణా జిల్లాకు చెందిన ఈ గ్రామానికి ప్రభుత్వ రికార్డులలో పెద్దగా విలువలేదు. గ్రాండ్ ట్రంక్ రోడ్ నుండి 45 నిమిషాల ప్రయాణం, ఆవ పువ్వులు విరబూసిన అందమైన పొలాలు మిమ్మల్ని రామ్‌గఢ్ సర్దారాఁకి తీసుకెళ్తాయి. అక్కడి గోడలు ఇప్పటికే తమ రికార్డును రాసుకున్నట్లు అనిపిస్తుంది. ఆలివ్ ఆకుపచ్చ రంగు సైనిక దుస్తులు ధరించిన అందగాడైన అజయ్ ఫోటోలు ఉన్న హోర్డింగ్‌లను వారు ఎలాంటి అరమరికలు లేకుండా అమరవీరుడు భగత్ సింగ్ సరసన ఉంచారు. తొమ్మిది దశాబ్దాల క్రితం తన సహచరులతో కలిసి ఉరికంబం ఎక్కిన భగత్‌సింగ్‌కు కూడా ఆ తర్వాత వరుసగా వచ్చిన ప్రభుత్వాలేవీ ఇంకా అమరవీరుని హోదా ఇవ్వలేదు.
ఒక హోర్డింగ్ మీద ఇలా రాసి ఉంది:
నవ్‌జవాన్ జద్ ఉఠ్దే నే
తాన్ నిజామ్ బదల్ జాన్దే నే
భగత్ సింగ్ అజ్జీ వి పైదా హూందే నే
బస్ నామ్ బదల్ జాందే నే…
[యువత ఉవ్వెత్తున లేచినపుడు,
కిరీటాలు కూలిపోతాయి.
ప్రతి కొత్త రోజునా ఒక భగత్ సింగ్ పుడుతూనే ఉంటాడు
ప్రపంచం వారిని పలురకాల పేర్లతో పిలుస్తుంది...]













