“చిన్నప్పుడు నేను చాలా అందంగా ఉండేదాన్ని. కానీ ఇప్పుడు, నా బాగోగులు చూసుకునే సమయం కూడా ఉండడం లేదు,” తన అద్దె ఇంటి మెట్లపై కూర్చుని, తనకి దొరికిన కొన్ని క్షణాల తీరికను ఆస్వాదిస్తూ నిట్టూర్చారు నూర్ (అసలు పేరు కాదు).
తనకి 22 ఏళ్ళ వయసప్పటి నుంచే నూర్ పనిచేస్తున్నారు. ప్రస్తుతం దిల్లీలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో క్లీనర్‌గా ఉద్యోగం చేస్తోన్న నూర్, అంతకుముందు నిర్మాణ స్థలాల్లో కూలీగా, ఒక ఫ్యాక్టరీలో కార్మికురాలిగా, ఆ పై ఇళ్ళలో పనిమనిషిగా కాయకష్టం చేశారు. “నేను దిల్లీ వచ్చినప్పటి నుండి పని చేస్తూనే ఉన్నాను," ఆవిడ PARIతో అన్నారు.
రోహిణి సెక్టార్ 15లోని ఆసుపత్రిలో నర్సింగ్, పారిశుద్ధ్య పనులలో నూర్ సహాయం చేస్తుంటారు. రోగుల గదులను శుభ్రం చేస్తారు. అవసరమైనప్పుడు వాళ్ళకు ఆహారం, మంచినీళ్ళు అందిస్తారు. అలాగే, గాయాలకు కట్టు కట్టడంలో, లేదా రోగుల బాగోగులు చూసుకోవడంలో నర్సులకు చేదోడువాదోడుగా ఉంటారు. “నేను రోజుకు సుమారు 12-13 గంటలు పనిచేస్తాను. ఇలా, నెలకు రూ.11,000 సంపాదిస్తున్నాను. అయితే, దిల్లీ లాంటి నగరంలో జీవించడానికి ఇది సరిపోదు,” ఆమె వివరించారు. “అద్దె, నీళ్ళు, విద్యుత్తు కోసం డబ్బు చెల్లించాలి.” ఇవన్నీ కలిపి, నెలకు సుమారు రూ.9,600 ఖర్చవుతాయని నూర్ తెలిపారు.
తన భర్త, మౌసీ (పిన్ని)లతో కలిసి 2004లో నూర్ దిల్లీ వచ్చారు. అప్పటికి కేవలం 21 ఏళ్ళ వయసున్న ఆమె, మొదటిసారి గర్భం దాల్చి ఉంది. బిహార్‌లోని సులిందాబాద్కు చెందిన ఆ కుటుంబం, మెరుగైన సంపాదన ఉంటుందన్న ఆశతో పని కోసం వెతుక్కుంటూ రాజధానికి వలస వచ్చింది. నూర్ ఒక మంచి జీవితాన్ని కోరుకున్నారు.
1991-2001 మధ్య కాలంలో, దిల్లీ-ఎన్‌సిటిలో వలసల పరంగా చూస్తే, బీహార్ రెండవ అతిపెద్ద స్థానంలో నిలిచింది. అయితే, పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే (2024) డేటా ప్రకారం, ఈ పరిస్థితిలో ఎలాంటి మార్పూ రాలేదు. బీహార్ నుండి 11 లక్షల కంటే ఎక్కువ మంది దిల్లీకి వలస వెళ్ళడానికి ప్రధాన కారణం ఉపాధి అని ఈ సర్వేలో తేలింది.
దిల్లీకి చేరుకున్నాక, నూర్ కుటుంబం కశ్మీర్ గేట్ దగ్గర ఉన్న ఝుగ్గీలలో(తాత్కాలిక నివాసాలు) స్థిరపడింది. గర్భవతిగా ఉన్న ఆ యువ వధువు, మొదటగా నిర్మాణ స్థలాలలో కూలీగా పనిచేశారు; ఆ తరువాత స్వరూప్ నగర్‌లోని ఒక ఫ్యాక్టరీలో పనికి కుదిరారు.








