గరీబ్ నగర్‌లోని గాలి దుమ్ముతోనూ, శోకంతోనూ దట్టంగా మారిపోయింది.
2026, మే 19-23 వరకూ కొనసాగిన ఆక్రమణల తొలగింపు చర్యలలో ముంబైలోని తూర్పు బాంద్రాలో సుమారు 500 గుడిసెలు నేలమట్టమయ్యాయి. ఆ గుడిసెలన్నీ దినసరి కూలీలకు, ఇళ్ళల్లో పనులు చేసే శ్రామికులకూ చెందినవి.
అక్కడంతా ఎక్కడచూసినా శిథిలాలతో నిండిపోయివుంది.
ఒక టార్పాలిన్ పట్టా కింద అలియా షేఖ్, రుక్సార్ ఖాన్ అఫ్సర్, ఆస్మా షేఖ్, హినా ఖాన్ కూర్చొని ఉన్నారు. ముస్లిముల జనాభా ఎక్కువగా ఉండే ఆ ప్రాంతంలో దశాబ్దాలుగా తమ నివాసాలుగా ఉండిన ఆ ప్రదేశానికి ఎదురుగా ఉన్న పేవ్మెంట్ మీద వాళ్ళిప్పుడు రాత్రివేళల్లో నిద్రపోతున్నారు.
మే 17 నాటి సాయంత్రం, బాంద్రా జంక్షన్ చుట్టూ ఉన్న నివాస ప్రాంతాలన్నింటినీ రెండు రోజుల్లోగా కూల్చివేస్తామని పేర్కొంటూ గరీబ్ నగర్ నివాసులకు ఒక నోటీసు అందింది.
ఇక్కడ నివాసముండే చాలామంది జరుపుకునే ఈద్ పండుగ మరి కొద్దిరోజుల్లోనే వస్తోంది.
"ఇన్సాన్ కీ ఇన్సానియత్ కహాఁ హై [మనుషుల మానవత్వం ఎక్కడుంది]?" 52 ఏళ్ళ గృహిణి అలియా, ఈ రిపోర్టర్‌ను అడుగుతున్నారు. ఆమె తన కోడలి కోసం, మనవ సంతానం కోసం కొన్న కొత్త బట్టలు, ఆమె ఇతర సామాన్ల మాదిరిగానే, వాడకుండా ఉండిపోయాయి.
















