ముల్లు మోదుగ చెట్టు (ఎరిథ్రినా వెరీగాటా) విరబూసింది. నాగాలాండ్‌లోని మోన్ గ్రామంలోని ఆ నిప్పు ఎరుపు రంగు పూలు వసంతకాలం రాకను, వార్షిక అవ్లేంగ్ పండుగ రాకను సూచిస్తాయి.
62 ఏళ్ళ నీలై కొన్యాక్ తన మనవడితో కలిసి ఇక్కడికి వచ్చారు. కొన్యాక్ విద్యార్థి సంఘ భవనం వరండాలో కూర్చొనివున్న ఆమె, "ఇక్కడికి రావడం, అన్ని కార్యక్రమాలను చూడటం నాకు చాలా ఉత్సాహంగా ఉంది," చిరునవ్వుతో అన్నారు. అయితే, ఆమె అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నది మాత్రం విందు కోసమే. "నేను ఎంతో రుచికరమైన ఆహారాన్ని ఆస్వాదించబోతున్నాను," అన్నారు నీలై. "అందులో జిగురుగా ఉండే అన్నం, మాంసం, చట్నీ, పండ్లు ఉంటాయి."
ఈ వేడుకలలో పాటలు, నృత్యాలు, కొంగ్-కై-హమ్-అచక్ మిక్ (వెదురు మరగాళ్ళతో పరుగు పందెం), ఖమ్ తుత్ (దుంగ డోలు వాయించడం), వన్ ఖన్ మిక్ (నిప్పు రాజెయ్యటం) వంటి సంప్రదాయ ఆటలు, కార్యక్రమాలు ఉంటాయి.
కొన్యాక్ తెగ వారు జరుపుకునే అవ్లేంగ్ పండుగ ఆరు రోజుల పాటు కొనసాగుతుంది. వసంతకాలంలోని మార్చి-ఏప్రిల్ నెలల్లో జరిగే ఈ పండుగలో, కొత్త ఝుమ్ (పోడు) భూముల్లో విత్తనాలు నాటిన తర్వాత, మంచి పంట రావాలని ప్రార్థిస్తూ, దేవుళ్ళ దీవెనలు పొందడానికి ఆ ప్రాంత ప్రజలు సమావేశమవుతారు. ఈ ప్రాంతాలలో ప్రధాన పంట వరి కాగా, పోడు వ్యవసాయం ఇప్పటికీ చాలా వరకు ఆచరణలో ఉంది.
కొన్యాక్ ప్రజలు ఇప్పటికీ వంశపారంపర్య గ్రామ పెద్దలు లేదా అంగ్ల పట్ల, అలాగే ఇటీవలి కాలంలో ఎన్నికైన సభ్యులతో కూడిన గ్రామ మండలి పట్ల గౌరవభావం కలిగి ఉన్నారు. స్థానికులు అవ్లేంగ్ లేదా ఓయా అని పిలిచే వార్షిక ఉత్సవం కోసం, కుటుంబాలన్నీ అంగ్ ఇంటి పక్కనే ఉన్న మైదానంలో సమావేశమవుతాయి.


