"ప్రభుత్వ పథకాల గురించి మాకెలా తెలుస్తుంది? మాకు ఉద్దేశించిన కార్యక్రమాల గురించి సమాచారం ఇచ్చేవారెవరూ లేరు," మహారాష్ట్రలోని ధారాశివ్ జిల్లాకు చెందిన 42 ఏళ్ళ సంజీవని బేడగే అన్నారు. ఆమె తుళజాపూర్ తాలూకా, జళకోట్ గ్రామానికి చెందిన ఒక రైతు. తనకు వచ్చే కొద్దిపాటి ఆదాయానికి తోడుగా ఆమె ఇతరుల పొలాల్లో కూడా పనిచేస్తారు. 2020 నుంచి ఆమె వివిధ ప్రభుత్వ పథకాలలో భాగం అయ్యే ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఆమె ప్రయత్నాలన్నీ విఫలమవుతూనే ఉన్నాయి. "నా భర్త శంకర్, లాక్డౌన్ మొదలవ్వటానికి కొద్ది రోజుల ముందు, 2020 జనవరి 24న ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు," సంజీవని చెప్పారు. "ఒక మనిషి చనిపోవచ్చు, కానీ అతను చేసిన అప్పు మాత్రం తీరిపోదు. రుణభారంతో నా భర్త తన జీవితాన్ని అంతం చేసుకున్నాడు. ఇప్పుడు నేను దిన దినం అదే భారంతో జీవిస్తున్నాను."
చనిపోయిన ఆమె భర్త తండ్రికి జళకోట్లో ఒక ఐదెకరాల పొలం ఉంది. అందులో శంకర్, ఆయన ముగ్గురు సోదరులు కలిసి ఉమ్మడి వ్యవసాయం చేసేవారు. "మాది నీటి సరఫరా లేని వర్షాధార భూమి, కానీ మేం మంచి ధరలు వచ్చే అవకాశమున్న వర్షాధార పంటలను వేసేవాళ్ళం," సంజీవని చెప్పారు. "మేం వర్షాకాలంలో సోయాచిక్కుళ్ళు, తూర్ (కంది) పంటలను వేసేవాళ్ళం; దీపావళి తర్వాత జోవర్ (జొన్న), గోధుమ, నల్ల శనగ పంటలను వేసేవాళ్ళం.”
2011 నుంచి 2014 వరకూ ఒక క్వింటాల్ జోవర్, గోధుమ, నల్ల శనగల ధర రూ. 2, 2000 వరకూ ఉండేది; క్వింటాల్ సోయా చిక్కుళ్ళు, తూర్ ధర రూ. 5,000 వరకూ ఉండేది. ఇంటి వాడకం కోసం కొంత పంటను పక్కకు తీసిపెట్టగా, వారికి సుమారు రూ. 26,400 విలువైన చలికాలపు పంట ఒక్కోటీ 4 క్వింటాళ్ళు, దానికి జతగా మరో రూ. 50,000 విలువైన ఒక్కోటీ 5 క్వింటాళ్ళ సోయా చిక్కుళ్ళు, తూర్ పంటలు మిగిలేవి. అంటే ఏడాదికి దగ్గర దగ్గర రూ. 76,400. ఈ డబ్బును నాలుగురు అన్నదమ్ముల కుటుంబాలు సమానంగా పంచుకునేవారని సంజీవని జళకోట్లో నాతో చెప్పారు.
"మేమంతా నివాసముండే కచ్చాఘర్ [గడ్డి పైకప్పుతో ఉన్న మట్టి ఇల్లు]కు అనేక సమస్యలుండేవి," ఆమె వివరించారు. "మరీ ముఖ్యంగా వానాకాలంలో పైకప్పు కారుతుండటంతో మా పిల్లలు తరచుగా జబ్బుపడేవాళ్ళు. ఆరోగ్య పరిరక్షణ అనేది చాలా ఖరీదైనది."








