సోమేశ్వర్ ఏకనాథ్ సల్గర్ స్నానం చేసి, తన గుడారం బయట కూర్చొని, నవంబర్ మాసపు ఎండలో తడి జుట్టును దువ్వుకుంటున్నారు. అది అతనికి చాలా కొద్దిపాటి విశ్రాంతి దొరికే సమయం - అతని పని రోజూ ఉదయం 4 గంటలకు ప్రారంభమై, 12-13 గంటల తర్వాత ముగుస్తుంది.
ఫడ్కరీ (చెరకు నరికేవాళ్ళు) అయిన సోమేశ్వర్ కొల్హాపూర్లో ఉన్న అనేక చక్కెర కర్మాగారాల్లో పని చేయడం కోసం వచ్చిన వందలాదిమంది కార్మికులలో ఒకరు. కొల్హాపూర్ జిల్లా పార్గాఁవ్ భదోలేలోని వారణా చక్కెర కర్మాగారంలో చెరకును నరకడం కోసం వచ్చిన కుటుంబాలన్నీ, రాబోయే నాలుగైదు నెలల కాలం అక్కడే ఉండేందుకు గుడారాలు ఏర్పాటు చేసుకున్నాయి.
వీరిలో ఎక్కువమంది మరాఠ్వాడాలోని బీడ్ వంటి కరువు పీడిత ప్రాంతాల నుంచి వచ్చినవాళ్ళు. సోమేశ్వర్ భావ్ తన కుటుంబంతో కలిసి బీడ్ జిల్లాలోని మున్గీ నుంచి వచ్చారు. 650 కిలోమీటర్లు ప్రయాణించి, కొల్హాపూర్ జిల్లాకు చేరుకోవడానికి వాళ్ళకు మూడు రోజులు పట్టింది. ఈ జిల్లా, చెరకు పంట గరిష్ట సాంద్రత కలిగిన ప్రాంతం..
“నా భార్య పరిమళ, మా ముగ్గురు కొడుకులు ప్రమోద్, వినోద్, దశరథ్లు కూడా మాతోనే ఉన్నారు," అన్నారతను. ఒక ట్రాక్టర్ ట్రాలీ వాళ్ళను వారి వస్తువులు, నిత్యావసర సరుకులతో పాటు ఇక్కడికి తీసుకువచ్చింది. వాళ్ళ గుడారం లోపలి నుంచి ధాన్యం బస్తాలు, గ్యాస్ సిలిండర్ కనిపిస్తున్నాయి.
























