తన రెండు దశాబ్దాల వడ్రంగం పనిలో బల్బీర్ విశ్వకర్మ ఏడు ఆలయాలను నిర్మించారు. పర్వతప్రాంతమైన ఉత్తరాఖండ్లో నిర్మాణాలకు సంబంధించి ఆయనకు తెలియని విషయం దాదాపు ఏదీ లేదు.
"యే హమారా ఖాందానీ కామ్ హై, బాప్ దాదా కే టైమ్ సే (ఇది మా పూర్వీకుల కాలం నుండి వస్తోన్న మా కుటుంబ వృత్తి," వెచ్చని దేవదారు చెక్కపై తన సుత్తిని, ఉలిని ఉంచుతూ PARIతో మాట్లాడటం కోసం పనిని ఆపిన బల్బీర్ అన్నారు.
మేం జౌన్సార్ ప్రాంతంలో ఉన్నాం. ఉదయకాలపు వెచ్చని సూర్యుడు పర్వత శ్రేణుల మీదుగా పైకి లేచి, మహసు దేవతకు అంకితమైన ఆలయ శిఖరాలను వెలిగిస్తున్నాడు; 2025 చివరిలో PARI సందర్శించినప్పుడు, ఈ ఆలయం ఇంకా నిర్మాణ దశలోనే ఉంది.
"మందిర్ బనానే కి శుర్వాత్ హమేశా నీచే సే హోతీ. పెహలే బేస్ బనేగా, ఫిర్ ఊపర్ కా. సబ్సే జరూరీ హై పిల్లర్ జిస్పే ఢాంఛా ఖడా హోగా [ఆలయ నిర్మాణమెప్పుడూ కింది నుండే మొదలవుతుంది, ముందు బేస్ తయారవుతుంది, ఆ తర్వాత పైభాగం. ఇందులో అత్యంత కీలకమైన అంశం స్తంభం; దీనిపైనే మొత్తం నిర్మాణం నిలిచివుంటుంది]," నిర్మాణమంతటినీ పరికిస్తూ చెప్పారు బల్బీర్.
థైనా గ్రామంలోని ఆలయంపై అత్యధికంగా తొమ్మిదేళ్ళ సమయం వెచ్చించాల్సి వచ్చిందని, నిపుణుడైన ఆ శిల్పి గుర్తుచేసుకున్నారు- ఆ ఆలయంలో అనేక అలంకారిక అంశాలున్నాయి. చిన్న ఆలయాలను ఒకటి రెండేళ్ళలోనే పూర్తి చేయవచ్చు.























