"మేమిక్కడి నుంచి కదలటానికి సిద్ధంగా లేం. మేమెక్కడికి వెళ్ళాలి? నిరాశ్రయుల్లాగా తిరుగుతూ ఉండాల్సొస్తుంది," అన్నారు మున్నాలాల్ కుర్మి. ఆయన మధ్యప్రదేశ్ రాష్ట్రం, దమోహ్ జిల్లాలోని సర్సేలా రీత్ అనే గ్రామానికి చెందిన ఒక రైతు. ఈ గ్రామం భారతదేశపు 54వ పులుల సంరక్షణ కేంద్రమైన వీరాంగన దుర్గావతి (విడిటిఆర్) పూర్తిగా కబళించబోతోన్న 93 గ్రామాలలో ఒకటి. ఏ నిముషానైనా ఇక్కడికి చీతాలు కూడా రానున్నాయనేదే ఇక్కడి మరో కొత్త విశేషం.
పులుల ఆవాసం కోసమే అంకితం చేసిన 58 పార్కులలో విడిటిఆర్ అత్యంత ఇటీవలి వాటిలో ఒకటి; వాటిలో రెండింటిని చిరుత కూడా పంచుకుంటుంది. ఈ సంరక్షణ కేంద్రాలు అభేద్యమైన ప్రదేశాలు, కేవలం వన్యప్రాణుల కోసం మాత్రమే కేటాయించినవి.
భారతదేశ మొత్తం అటవీ విస్తీర్ణంలో సుమారు 10 శాతానికి సమానమైన దాదాపు 80,000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఈ సంరక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయటం కోసం, మొత్తం 257 గ్రామాల ప్రజలను వారి నివాసాల నుండి తరలించి, నిర్వాసితులుగా మార్చారని కేంద్ర ఆదివాసీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి దుర్గాదాస్ ఉయికే 2025, డిసెంబర్లో లోక్సభకు తెలియజేశారు. అంతేకాక, ఈ అభయారణ్యాల పరిధిలోనే ఉన్న మరో 730 గ్రామాల ప్రజలను కూడా అక్కడి నుండి తొలగించే ప్రక్రియ తదుపరి దశలో ఉంది.
కొత్తగా ఏర్పాటు కానున్న అభయారణ్యంలో కలిసిపోనున్న మరో గ్రామం దమోహ్ జిల్లాలోని దబా. "మేమెక్కడ నివాసముండాలి? మాకు తిండెలా దొరుకుతుంది?" నౌరాదేహీ వన్యప్రాణి సంరక్షణా కేంద్రం సరిహద్దులో ఉన్న ఆ గ్రామానికి చెందిన రాధా రాణి గోండ్ ప్రశ్నిస్తున్నారు. చలికాలపు ఎండలో తన ఇంటి ముంగిట కూర్చుని, అప్పుడే చేతికి వచ్చిన గోధుమ పంటను చేతులతో తడుముతూ ఉన్న ఆ 75 ఏళ్ళ వృద్ధురాలు, తీవ్ర మనస్తాపానికి గురైనట్లు స్పష్టంగా కనిపిస్తున్నారు.
అభయారణ్యాల మూలాధారం ‘కోట వంటి పరిరక్షణ’ – అంటే వన్యప్రాణుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రక్షిత ప్రాంతాలు. పులులు, మనుషులు కలిసి జీవించలేరనే అతి సరళమైన వివరణను ఇది అనుసరిస్తుందని పర్యావరణవేత్తలు పేర్కొంటున్నారు. అయితే వాస్తవమేమిటంటే, భారతదేశంలోని అడవులలో నివాసముండే సముదాయాలు ఎల్లప్పుడూ వన్యప్రాణులకు చాలా దగ్గరగానే జీవించాయి. “అడవిని, జంతువులను సంరక్షించేది మేమే. మమ్మల్ని బయటకు గెంటేసి, ఇక్కడే ఒక పర్యాటక అతిథి గృహాన్ని నిర్మిస్తారు,” అంటారు జనకా బాయి. 2015లో పన్నా పులుల అభయారణ్యం విస్తరణలో ఆమె గ్రామం ఉమ్రావన్ కలిసిపోయింది.























