"దీదీ (అక్కా), మేమిక్కడ నిజంగానే మన సొంత భాషను చదువుకోవచ్చా?" తన చేతుల్లో ఒక కుడుఖ్ పుస్తకాన్ని పట్టుకొనివున్న 15 ఏళ్ళ అంశ్ ఉరాఁవ్ నన్నడిగాడు.
మేమంతా పశ్చిమ బెంగాల్, జల్పాయగురిలోని తేయాకు తోటల్లో పనిచేసే శ్రామికుల పిల్లలు చదువుకునే ఒక బడిలో ఉన్నాం. అంశ్ తల్లిదండ్రులు, నా తల్లిదండ్రులు పనిచేసే తోట లీశ్ నది పక్కనే ఉంది.
ఇక్కడి అనేకమంది శ్రామికుల కుటుంబాలకు లాగే మా కుటుంబాలు కూడా ఉరాఁవ్ తెగకు చెందినవి. మా పూర్వీకులు నాలుగు తరాల క్రితం ఛోటానాగపూర్ పీఠభూమి ప్రాంతం - ప్రస్తుత ఝార్ఖండ్‌లోని రాఁచీ, గుమ్లా, సిమ్డేగా జిల్లాలు - నుంచి వచ్చారు. మేం ఇప్పటికీ మా ఇళ్ళ వద్ద మా సముదాయపు భాష అయిన కుడుఖ్లోనే మాట్లాడుకుంటాం, కానీ బయట మాత్రం హిందీ, బెంగాలీ భాషల్లో మాట్లాడతాం. అందువలన, అంశ్ ఇంతకుముందెప్పుడూ మా మాతృభాషలో ఉన్న పుస్తకాన్ని చూడలేదు.
నేను ఇక్కడే, లీశ్ నది తేయాకు తోటల మధ్యనున్న పాతిబాడీలో పెరిగాను. జనాభా లెక్కల రికార్డులలో ఈ ప్రదేశాన్ని 'లిశ్ నది'గా గుర్తించినప్పటికీ గ్రామస్తులు, స్థానిక పరిపాలనాధికారులు ఇప్పటికీ లీశ్ నది అనే స్పెల్లింగ్నే ఉపయోగిస్తున్నారు.



















