30 కిలోల గ్యాస్ సిలిండర్ను తన వీపుపై మోసుకుంటూ మాయా థామి మూడు కిలోమీటర్లు నడిచారు. ఆ బరువును మోస్తూ 200 మెట్లు ఎక్కి ఆమె ఆ సిలిండర్ని ఆ రోజుకు తన మొదటి ఖాతాదారుకు అందజేశారు.
32 ఏళ్ళ మాయా శ్వాస తీసుకుంటూ, "ఇప్పుడు నేను ఆ కొండ పైకి మరొక సిలిండర్ని అందించాలి," అని దూరంగా ఉన్న ఒక ప్రదేశాన్ని చూపిస్తూ చెప్పారు. తన శ్రమకు ప్రతిఫలంగా రూ. 80 అందుకున్న ఆమె తన తర్వాతి డెలివరీకి వెంటనే బయలుదేరారు. ఆ తర్వాత మరో ఆరు గంటల పాటు ఆమె ఎల్పిజి (లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్) సిలిండర్లను మోసుకెళ్ళే పనిలోనే ఉంటారు.
"ముఖ్యంగా బరువు ఎక్కువగా ఉన్నప్పుడు పురుషులకు ప్రాధాన్యం ఇస్తారు. మేం పురుషులం కాదు కాబట్టి జనం తరచుగా మాతో బేరాలాడుతారు," అని మాయ చెప్పారు. ఒక మహిళ ఒక ట్రిప్పుకు రూ. 80 సంపాదిస్తే, ఒక పురుషుడు అదే దూరానికి కొన్నిసార్లు రూ.100 సంపాదిస్తాడు.
పశ్చిమ బెంగాల్లో రద్దీగా వుండే పట్టణమైన డార్జిలింగ్ తూర్పు హిమాలయాలలో సముద్ర మట్టానికి 2,042 మీటర్ల ఎత్తున ఉంది. కొండలతో నిండివుండే ఈ ప్రాంతాలలో రోడ్డు రవాణా సమస్యాత్మకం కాబట్టి, అక్కడ నివసించేవారు తమ రోజువారీ అవసరాలైన కూరగాయలు, నీరు, సిలిండర్లు, ఇంకా ఎప్పుడో ఒకసారి ఇంటి కోసం తీసుకొచ్చే ఉపకరణాలను చేరవేయడానికి కూడా తప్పనిసరిగా మోతకూలీలపైనే ఆధారపడాలి. అక్కడికి చేరుకోవటానికి ఉన్న వంపుల మార్గాన్ని వాహనాలు అధిరోహించలేవు. అందుకే వస్తువులను స్వయంగా మోసుకువెళ్ళడం, లేదా గ్యాస్ ఏజెన్సీ లేదా దుకాణంవారు వాటిని తమ మోతకూలీల ద్వారా వారి ఇళ్ళకు పంపడం వారికున్న ఇతర మార్గాలు.











