“ఆ రాత్రి మబ్బులు ముంచుకొచ్చి కురిసిన వర్షానికి అన్నీ కొట్టుకుపోయాయి... మీరే చూడండి. మొత్తం కొట్టుకుపోయింది. మా ఇంటినీ, నాలుగు పశువులను నష్టపోయాం. సమస్తాన్నీ...” సీనారేకు గోడలనూ. సాలలనూ మాకు చూపిస్తూ శ్రీకవల్ భారత్ మోరే వివరించారు. “నీళ్ళు మా నడుముల వరకూ వచ్చాయి. మా అబ్బాయి మమ్మల్ని కేకలువేసి నిద్ర లేపాడు కాబట్టి బ్రతికి బయటపడ్డాం. కానీ ఆ నీళ్ళు...”
తాను కాపాడుకోగలిగిన వస్తువులను ఇంట్లోని ఇనప అటకల మీద భద్రం చేశారు మోరే మౌశీ. ఇంటి మట్టి నేల కొట్టుకుపోయి, గుంటలుపడ్డ ఎగుడుదిగుడు ఇసుక నేల మిగిలింది.
ధారాశివ్ (ఒకప్పుటి ఉస్మానాబాద్) జిల్లా, భూమ్ బ్లాక్‌లోని చించ్పూర్ ఢగేలో 2025, సెప్టెంబర్ 21న కుండపోత వర్షం కురిసింది. ఆ గ్రామం గోదావరికి ఉపనది అయిన బాణ్గంగా నది ఒడ్డున ఉంది. మర్నాడు, సెప్టెంబర్ 22న కూడా రాత్రంతా వర్షం కురుస్తూనే ఉంది. గ్రామం నీటిలో మునిగిపోయింది. “జీవితంలో ఇంతవరకూ ఇలాంటిది చూడలేదు,” అంటూ జనం ఆ జలప్రళయాన్ని వర్ణించారు.
సూర్యకాంత్ మోరే ఆ నదిని మాకు చూపించారు. నది గట్ల వెంట ఉన్న పొలాలతోబాటు, ఒక్కొక్క ఎకరం విస్తీర్ణమున్న ఆయన రెండు ద్రాక్ష తోటలు కూడా కొట్టుకుపోయాయి. “చివరి నిముషంలో పశువులను కాపాడుకోగలిగాం. అప్పటికే అవి మెడలోతు నీళ్ళలో మునిగివున్నాయి. వాటిని వదిలేశాను, అవి బ్రతికిపోయాయి,” అన్నారు మోరే. “కానీ రేకుల సాలలో నిల్వ చేసినవన్నీ తడిసిపోయాయి. బస్తాలకొద్దీ జ్వారీ (జొన్నలు), మూఁగ్ (పెసలు), ఉదిద్(మినుములు), వేరుశనగలు – అన్నీ. కడ్బా - పశుదాణా కోసం ఉంచిన జొన్న, మొక్కజొన్న చొప్ప - మొత్తం కొట్టుకుపోయింది.
ఒకటిన్నర ఎకరం పొలంలో ఉల్లి పంట వేశారు మోరే. ఇప్పుడదంతా రాళ్ళూ రప్పలమయమైంది. మొత్తం ఉల్లి మొలకలతో పాటు సారవంతమైన పై మట్టి పొర కూడా ప్రవాహ ఉధృతిలో కొట్టుకుపోయాయి.























