ఈ కథనం పులిట్జర్ సెంటర్ మద్దతుతో పార్థ్ ఎమ్. ఎన్. రాస్తోన్న సిరీస్లో ఒక భాగం.
తీవ్రమైన మానసిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతోన్న తన కుమార్తెకు నయం కావడానికి అద్భుత నివారణ కోసం 75 ఏళ్ళ ఆస్మా ఖాన్ 100 కిలోమీటర్లకు పైగా దూరం ప్రయాణించి వచ్చారు. ఇది జరిగి 12 ఏళ్ళకు పైగా గడిచినా, తల్లీకూతుళ్ళు ఇద్దరూ ఇంకా ఇంటికి తిరిగి చేరుకోలేదు.
మహారాష్ట్రలోని మరాఠ్వాడా ప్రాంతం, సంభాజీ నగర్ (గతంలో ఔరంగాబాద్) జిల్లాలోని ఒక గ్రామంలో కూలీ కుటుంబంలో జన్మించిన ఫాతిమా, చిన్నతనంలో చాలా ఇబ్బందులు పడ్డారు. ఆమెకు తీవ్రమైన తలతిరిగే వ్యాధి వచ్చింది, దీని వల్ల ఆమె తరచుగా అపస్మారక స్థితిలోకి వెళ్ళేది. ఇది క్రమంగా తీవ్రమై హింసాత్మక ప్రవర్తనకు కూడా దారితీసింది.
"ఆమెను మేం కొన్నేళ్ళ పాటు ఒక వైద్యుడి నుండి మరొక వైద్యుడి వద్దకు తీసుకెళ్తూ గడిపాం," అని ఆస్మా చెప్పారు. "ఆమెకు చికిత్స చేయించడానికి మేం మా పశువులను కూడా అమ్మేశాం, కానీ అవేమీ పని చేయలేదు. ఆమె పరిస్థితి క్షీణిస్తూనే ఉంది, వాస్తవ పరిస్థితుల మీద ఆమె తన పట్టును కోల్పోతూ ఉందని చెప్పుకోవచ్చు."
ఒక రోజున, ఫాతిమా ఎవరినీ గుర్తుపట్టడం మానేసింది, తీవ్ర నిరాశలోకి కూరుకుపోయింది. ఆమెకు అప్పటికే ముప్పై ఏళ్ళు దాటాయి, ఆమె తల్లిదండ్రులకు అవకాశాలేమీ మిగలకుండా పోతున్నాయి. ఆమె క్షీణిస్తున్న మానసిక ఆరోగ్యం ఆమె తల్లిదండ్రులను కలవరపెట్టింది. అంతేగాక, కుటుంబానికి తర్వాతి పూటకు భోజనం ఏర్పాటుచేయటం గురించి కూడా వారు ఆందోళన చెందాల్సి వచ్చింది.
"ఆమె తన బట్టలను చింపుకునేది, ఆమెను కట్టడి చేయటమెలాగో మాకు తెలిసేది కాదు," ఆస్మా గుర్తుచేసుకున్నారు. ఆ సమయంలో, ఒక పొరుగు వ్యక్తి ఒక అసాధారణ సూచన చేశారు.
వారి ఊరికి 100 కిలోమీటర్ల దూరంలో ఉండే మరొక గ్రామంలో సుమారు 117 ఏళ్ళ పురాతనమైన మందిరం ఒకటుంది. పురాకథనాల ప్రకారం, హజ్రత్ హాజీ అబ్దుర్ రెహమాన్ షా, లేదా సైలానీ షా బాబా, 19వ శతాబ్దం చివరలో పింపళ్గావ్ సరాయ్కు వచ్చారు. ఈ గ్రామం విదర్భ ప్రాంతంలోని బుల్ఢాణా పట్టణానికి 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. అక్కడి సైలానీ బాబాకు 'దయ్యం పట్టినవారిని' ఆ దయ్యం నుంచి విడిపించిన ఖ్యాతి ఉంది. ఆయన జ్ఞాపకార్థం ఆయన మరణించిన 1908 సంవత్సరంలో అక్కడొక దర్గాను నిర్మించారు.
అప్పటి నుండి, ప్రతి ఏటా మార్చి నెలలో ఇక్కడ ఉర్సు పండుగ జరుపుకుంటారు, దీనికి లక్షలాది మంది భక్తులు హాజరవుతారు.









