ఒక రెండు వారాలపాటు బాలో మాఁఝీ, మరో తొమ్మిది మంది నిర్మాణ కార్మికులు ఒక అసాధారణ కార్యక్రమంలోకి దిగారు: సమీపంలో ఉన్న అడవుల నుండి వంటచెరకును సమీకరించటం.
“ప్రతి మూడు నాలుగు రోజులకొకసారి, మేం పొద్దుపొద్దున్నే ఐదు గంటలకంతా బయటకు వెళ్ళిపోతాం. మధ్యాహ్నమయ్యేసరికి ప్రతి ఒక్కరూ 10-12 కిలోల వంటచెరకుతో తిరిగివస్తాం," బిహార్‌లోని నలందా జిల్లా, అర్పా పంచాయత్‌లో ఉన్న తన ఇంటి సమీపంలో ఒక మంచంపై కూర్చొని వున్న 55 ఏళ్ళ బాలో చెప్పారు.
"మేం సేకరించిన వంటచెరకుతో ఒక మూడు నాలుగు రోజుల పాటు పదిమంది మనుషులకు వంట చేయగలం," అన్నారు బాలో. "కానీ మేం అన్నం, పప్పు లేదా ఏదైనా కూరగాయలను మాత్రమే వండుకోగలం. ఎందుకంటే మూడో పదార్థం వండటమంటే, మరిన్ని కట్టెలను కాల్చటమే అవుతుంది."
ఇక్కడాయన, తమిళనాడులోని చెన్నై నగరం ప్రధాన శివారు ప్రాంతమైన తాంబరంలో ఒక నిర్మాణ ప్రాంతంలో తాను పనిచేసిన రోజుల గురించి చెప్తున్నారు.
కొనసాగుతోన్న ద్రవీకృత పెట్రోలియం గ్యాస్ (ఎల్పిజి) సంక్షోభానికి బాలో, అతని తోటి వలస కార్మికులు రూపొందించుకున్న ఈ తాత్కాలిక పరిష్కారం ఒక రెండు వారాలు మాత్రమే నిలిచింది. “కట్టెలు దొరకడం అన్నివేళలా సాధ్యం కాదు,” అంటారతను.








