విపత్తులు ముంచుకొచ్చినపుడు పంచిన సహాయక సామగ్రిలో అందిన దినుసులతో, మచ్ఛీవాలా గ్రామప్రజలు టీ పెట్టి, ఓ కప్పులో ఈ విలేఖరికి అందించారు. గట్లు తెంచుకుని పోటెత్తిన రావీ నది వాళ్ళ ఇళ్ళను నాశనం చేసింది, పొలాలను బురదా నీళ్ళతో నింపి, వాళ్ళను నీటి మధ్యన ఇరికించి, తాత్కాలికంగా వేసుకున్న గుడారాల్లోకి చేర్చింది.
ఈ అగస్ట్ వరదల్లో వాళ్ళు దాదాపుగా సర్వస్వం కోల్పోయారు.
రామ్‌దాస్ బ్లాక్ లోని మచ్ఛీవాలా గ్రామం బయటనున్న ఒక ఝుగ్గీ (గుడారం)లో శరబ్‌జీత్ కౌర్ కూర్చొని ఉంది. ఆ గుడారం, రావీ నదిలో కొట్టుకుపోక ముందర ఆమె నివాసమున్న ఇంటికి సమీపంలోనే ఉంది. తన జీవితం తిరిగిన ఒక దారుణమైన మలుపును వర్ణిస్తూ ఇబ్బందిగానైనా ఒక చిరునవ్వును కౌర్ తెచ్చుకోగలిగింది.
“రాత్రంతా మా బంధ్ [మనుషులు కట్టిన గట్లు]ను గట్టిపరచుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాం,” అంటూ ఆ పద్ధెనిమిదేళ్ళ యువతి PARIకి చెప్పింది. “ఆగస్ట్ 27 [2025]న పొద్దున్న ఆరింటికి, ధుస్సీ [మట్టితో కట్టిన గట్టు]కి గండి పడిందని గురుద్వారాలోని లౌడ్ స్పీకర్లోంచి ఒక ప్రకటన వినిపించింది. విన్నవాళ్ళు దాన్ని ఊరంతా చేరవేశారు. ఎత్తైన స్థలం మీద తలదాచుకోవడానికి మేమంతా పరుగులు తీశాం.”
అమృత్సర్ జిల్లాలోని మచ్ఛీవాలా 1,186 మంది జనాభా (2011 జనాభా లెక్కల ప్రకారం) ఉన్న ఒక చిన్న గ్రామం. వారిలో ఎక్కువమంది జట్ట్ శిక్ఖ్, రాయ్ శిక్ఖ్ సముదాయాలకు చెందినవారు. పంజాబ్‌లో రాయ్ శిక్ఖ్ అనేది ఒక షెడ్యూల్డు కులం. ఈ దళిత కుటుంబాలు జీవనోపాధి కోసం ప్రధానంగా చిన్న చిన్న మడుల్లో వ్యవసాయం చేస్తూ, ఇతర రైతుల పొలాల్లో కూలిపనులు చేస్తారు.
రాయ్ శిక్ఖ్ సముదాయానికి చెందిన సొంత భూమి లేని శరబ్‌జీత్ కుటుంబం పొట్ట పోసుకోవడానికి వ్యవసాయ కూలి పనులు చేస్తుంది. వ్యవసాయ కూలీ అయిన ఆమె తల్లి ఆరు నెలల క్రితం మరణించారు; ఆమె తండ్రి మూర్ఛరోగి కావడంతో ఏ పనీ చెయ్యలేరు. ఇద్దరు సోదరులూ ఒక సోదరీ ఉన్న ఆ కుటుంబం, తమ ఇల్లు గడవటం కోసం కూలిపనులు చేస్తుంటారు.
ఎనిమిది అడుగుల ఎత్తువరకూ చేరిన వరద నీరు ఊరిని మూడు నాలుగు రోజులపాటు ముంచేసింది. అది రైతు కూలీల చిన్నపాటి ఇళ్ళను ధ్వంసంచేసి, పండేందుకు సిద్ధంగా ఉన్న ఖరీఫ్ వరి పంటను పూర్తిగా దెబ్బతీసి, పొలాలను బురదమయం చేసింది. పెద్ద పెద్ద యూకలిప్టస్ చెట్లు కూడా కూలిపోయాయి.
















