రుబేల్ షేక్, అనిల్ ఖాన్లు డ్రైవింగ్ చేస్తున్నారు... కానీ వాళ్ళెక్కడా భూమికి దగ్గరగా లేరు. భూమికి దాదాపు 20 అడుగుల ఎత్తులో, అది కూడా దాదాపు లంబంగా 80 డిగ్రీల వాలులో ఉన్నారు. అగర్తలాలోని ఆ మేళాలో ఉన్న పెద్ద జనసమూహం చప్పట్లు కొడుతూ కేకలు వేస్తూ వారిని ప్రోత్సహిస్తోంది. రుబేల్, అనిల్‌లు కారు కిటికీల నుంచి బయటకు వచ్చి జనం వైపు చేతులూపుతున్నారు.
వాళ్ళిద్దరూ మౌత్-కా-కువాఁ (మృత్యు కూపం)ను - కారు, బైక్‌లను 'గోడ' లేదా వేదిక పక్క భాగంలో నిట్టనిలువుగా నడిపిస్తూ చేసే అనేక విస్మయపరిచే విన్యాసాలు - ప్రదర్శిస్తున్నారు.
10 నిమిషాల నిడివి గల ఆటలుగా విభజించిన ఈ ప్రదర్శనలు అనేక గంటలపాటు కొనసాగుతాయి. ఈ ప్రదర్శన చెక్క పలకలతో నిర్మించిన ఒక బావిలాంటి నిర్మాణం లోపల జరుగుతుంది. మేళాలలో దీన్ని ఏర్పాటు చేయడానికి కొన్ని రోజులు పడుతుంది. వాటి నిర్మాణం వారి ప్రదర్శన, భద్రత విషయంలో చాలా కీలకమైనది కాబట్టి, చాలామంది సవారీ చేసేవాళ్ళే ఈ ప్రదేశాన్ని నిర్మించడంలో పాలు పంచుకుంటారు.
అశుభాన్ని సూచించే 'మౌత్-కా-కువాఁ' అనే పేరున్న ఈ ప్రమాదకరమైన ప్రదర్శన 2023 అక్టోబర్‌లో త్రిపురలోని అగర్తలాలో జరిగే దుర్గాపూజ సందర్భంగా జరిగే మేళాలో నిర్వహించే అనేక ఆకర్షణలలో ఒకటి. ఫెర్రిస్ వీల్, రంగులరాట్నం, బొమ్మ రైళ్ళు మొదలైనవి ఇతర ఆకర్షణలు.























