ఏ బేరా బేటీ ఇయం తఁయ్ మార్చి బారీ తే, బేరా బేటీ ఇయం తఁయ్
ధాఁయ్ సే దదా జో ఈనాం రే, బిహా గోటే నీ
మన్ మజూర్ ఈనా లా రే, బిహా గోటే నీ
మార్చి బారీ తే, బేరా బేటీ ఇయం తఁయ్
ధాఁయ్ సే దదా జో ఈనాం రే, బిహా గోటే నీ
[మిరప పొలంలో నా కూతురు ఏడుస్తుంది
నాన్నా, నాకు పెళ్ళిసంబంధం కోసం వెళ్ళు, నాకు పెళ్ళి చేసెయ్యి
మా మనసులు కలిశాయి, నీకూ ఇష్టమైతే నాకు పెళ్ళి చేసెయ్యి
మిరప పొలంలో నా కూతురు ఏడుస్తుంది
నాన్నా, త్వరగా వెళ్ళి మాట్లాడు
నీకూ ఇష్టమైతే నాకు పెళ్ళి చెసెయ్యి]
లఖేశ్వరి బాయి ఖరియా కళ్ళు దించుకొని చేతిలో పట్టుకున్న మైక్రోఫోన్‌ని చూస్తూ పాడుతున్నప్పుడు ఆమె మరొక ప్రపంచంలోకి వెళ్ళిపోయారు. ఇది ఆమెకొక అసాధారణ క్షణం. లఖేశ్వరి పాడుతున్నప్పుడు మేం రికార్డ్ చేస్తుండగా ఆమె చుట్టుపక్కల ఉన్న కొద్దిమంది ఆమె పాడుతోన్న, మాట్లాడుతోన్న భాషను వినడానికి ఆసక్తి చూపుతారు. కానీ ఆమె పలికే ప్రతి ఒక్క మాటతో, ఆమె మనస్సు ఒక మిల్లీసెకన్లోనే 160 కిలోమీటర్లు ప్రయాణించి రాయ్‌గఢ్‌కు చేరుకుంటుంది. ఆమె చిన్నతనపు రోజులను ఈ శబ్దాలే నింపాయి.
“ఇప్పుడు నేను ఎవరితో మాట్లాడేది? మా అత్తామామలు ఇక లేరు. 'మీ అమ్మ భాషలో నాతో మాట్లాడండి, దాన్ని నా దగ్గర నేర్చుకోండి,’ అని పిల్లలకు చెబుతాను. అయితే వాళ్ళెక్కడ వింటారు? నా మనవళ్ళ సంగతైతే చెప్పనవసరమే లేదు. ఈ ఊళ్ళో ఇక ఖరియా మాట్లాడేది నేనొక్కదాన్నే మిగిలాను," పాటన్దాదర్ గ్రామానికి చెందిన ఈ 55 ఏళ్ళ ఆదివాసీ మహిళ విచారంగా చెప్పారు.
మహాసముంద్ జిల్లాలోని ఈ గ్రామంలో అందరూ 'జూనా' అని పిలిచే లఖేశ్వరి బాయి ప్రస్తుతం అరవయ్యేళ్ళు దాటిన బుఢువా ఖరియాను పెళ్ళిచేసుకున్నాక ఈ గ్రామానికి వచ్చి స్థిరపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం ద్వారా వీరికి వచ్చిన రెండెకరాల భూమిలో వీరు చేసే వ్యవసాయం వారి ఇల్లు గడవటానికి సరిపోదు. దాంతో భార్యాభర్తలిద్దరూ వ్యవసాయ కూలీలుగా కూడా పనిచేస్తుంటారు. "రాయ్‌గఢ్ నుంచి నేనిక్కడికి వచ్చినప్పుడు మా అత్తమామలతో ఖరియాలోనే మాట్లాడేదాన్ని. ఇప్పుడు వాళ్ళిద్దరూ కాలంచేయటంతో ఆ భాషలో మాట్లాడుకోవటానికి ఇంకెవరూ లేరు," లఖేశ్వరి చెప్పారు. "నేను పదాలను సరిగ్గా పలకలేను, అందుకని వాటిని ఉపయోగించటం మానేశాను," ఆమె భర్త బుఢువా వివరించారు. "ఇక్కడ ఛత్తీస్గఢీదే రాజ్యం. ఈ భాషను ఎవరు అర్థంచేసుకుంటారు?"




