"మేం ఇక్కడికి [మార్చ్‌లో పాల్గొనటానికి] ఒక పరీక్ష కోసమో ఒక ఉద్యోగం కోసమో వచ్చామని జనం అనుకుంటారు. కానీ, మా భవిష్యత్తుకు విలువ ఉందన్న విషయాన్ని నమ్మడం ఏటేటా కష్టంగా మారుతుండటం వల్లే మేమిక్కడికి వచ్చాం," ఛోటూ యాదవ్ అంటున్నారు.
ఇరవయ్యేడేళ్ళ ఈ యువకుడు బిహార్‌లోని సీవాన్ నుండి దిల్లీకి జనసమ్మర్దంతో కిక్కిరిసి ఉన్న ఒక రైలులోని జనరల్ కంపార్ట్మెంట్లో రెండు రోజుల పాటు ప్రయాణించి వచ్చారు. "మా గ్రామాల్లోని యువత వలస వెళ్ళక తప్పని పరిషితుల్లో పడటమో, ఎప్పటికీ రాని అవకాశాల కోసం ఎదురుచూస్తూ ఉండిపోవడమో జరుగుతోంది," అంటారు ఛోటూ.
భారతదేశపు యువత ఆందోళనలను నేరుగా పార్లమెంటుకు తీసుకువెళ్ళాలన్న కాక్రోచ్ జనతా పార్టీ (సిజెపి) ఇచ్చిన పిలుపుతో, పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యే 2026 జూలై 20న చలో సంసద్ కార్యక్రమం మొదలైంది.
ఈ నిరసన ఇప్పుడు సిజెపి పరిధిని దాటి, దేశవ్యాప్తంగా అనేక నగరాలకు విస్తరించిన ఒక ఉద్యమంగా మారింది.
పరీక్షా పత్రాలు పదేపదే లీక్ కావడమనేది నిరుద్యోగం, ప్రభుత్వ ఉద్యోగ నియామకాలలో జాప్యం, ప్రభుత్వ సంస్థలు, విస్తృత వ్యవస్థ, అలాగే పాలనపై ప్రజలకున్న నమ్మకం క్రమంగా సన్నగిల్లుతోందన్న ఆందోళనలకు వ్యతిరేకంగా ఒక విస్తృత ఉద్యమానికి దారితీసింది. తగ్గిపోతున్న ఉద్యోగ అవకాశాలు, పెరుగుతున్న గ్రామీణ వలసలు, తమ భవిష్యత్తును రూపొందించుకునే నిర్ణయాల ప్రక్రియలో తమను, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల యువతను, పక్కన పెడుతున్నారనే భావన పట్ల యువత తమ అసహనాన్ని, ఆగ్రహాన్ని వ్యక్తం చేయడానికి ఈ ఉద్యమం ఒక వేదికగా మారింది.
"నా వంటి గ్రామీణ యువత తమ భవిష్యత్తు పట్ల ఆశ కోల్పోకూడదనే ఉద్దేశంతోనే నేను దిల్లీకి వచ్చాను," పాలీలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో మెడిసిన్ చివరి సంవత్సరం చదువుతోన్న 25 ఏళ్ళ ధీరమ్ చెప్పారు. ఆయన తన స్నేహితుడు, హ్యుమానిటీస్ విద్యార్థి అయిన 24 ఏళ్ళ అశు రామ్‌తో కలిసి ఇక్కడికి వచ్చారు. రాత్రంతా సాగిన 15 గంటల ప్రయాణం చేసిన ఈ ఇద్దరు స్నేహితులు జూలై 19 మధ్యాహ్నానికి దిల్లీ చేరుకున్నారు.


























