కేరళలోని 9వ తరగతి విద్యార్థులు తమ మలయాళ భాషా ప్రశ్నాపత్రాన్ని తెరవగానే, అందులో తనిచ్చిరిక్కుంబోళ్ (నేను ఒంటరిగా ఉన్నప్పుడు) అనే ఒక ప్రత్యేక కవిత ఉంది. ఆ పంక్తులు నిశ్శబ్దం, ఒంటరితనం, ఒంటరిగా ఉన్నప్పుడు స్థిరపడే స్పష్టత గురించి మాట్లాడాయి. రాష్ట్రవ్యాప్తంగా పరీక్ష రాస్తోన్న లక్షలాది మంది టీనేజర్లకు తాము ఒక యువ కవి పి.ఎ. సెబాను చదువుతున్నామని తెలియదు.
అదే ఏడాది 2023లో ప్రతిబింబాలు, కవితలు, దృశ్య వ్యక్తీకరణల పుస్తకమైన విరళ్ పళుతిళే ఆగాశంగళ్ అనే పుస్తకాన్ని సెబా ప్రచురించింది. ఇందులో కూడా వెన్నెముక కండరాల క్షయ (ఎస్ఎమ్ఎ)తో ముడిపడిన ఆమె జీవితం గురించే ఉంది. ఈ వ్యాధి కండరాల బలహీనతకు కారణమయ్యే ఒక అరుదైన జన్యు పరిస్థితి. దీనికి చికిత్స లేదు. ఎస్ఎమ్ఎతో ఉన్న రోగులు నెమ్మదిగా వారి శరీరాలపై నియంత్రణ కోల్పోతారు, చివరకు శ్వాస తీసుకోవడం కూడా ఒక ట్యూబ్ ద్వారా తీసుకోవాల్సివస్తుంది.
పరీక్ష రాస్తున్న విద్యార్థులకు గానీ, దూర ప్రాంతాలలోని పాఠకులకు కూడా రచయిత్రి చాలా ఏళ్ళుగా తన గదిని వదిలి బయటకు రాలేదనే సంగతి తెలియదు. ఆమె తన శ్వాసనాళంలో గొట్టంతో వెల్లకిలా పడుకుని ఉన్నప్పుడు ఆ పంక్తులను రాసింది. ఆరేళ్ళకు పైగా, సెబా ట్రకియోస్టమీ గొట్టం ద్వారా శ్వాస తీసుకుంటోంది. ఆమె నడవలేదు, కూర్చోలేదు, కష్టపడకుండా మింగలేదు.
27 ఏళ్ళ సెబా ఒక సృజనాత్మక విశ్వాన్ని టైప్ చేయటం కోసం తన మొబైల్ ఫోన్‌ను ఉపయోగిస్తుంది. 2018లో, ఆమె చాలా కష్టమ్మీద ఉపయోగించే ఐదు అంగుళాల మొబైల్ స్క్రీన్‌పై సృష్టించిన తన పనిని ఆన్లైన్లో పోస్ట్ చేయడం ప్రారంభించింది.
సోషల్ మీడియాలో ఆమె రచనలను పి. వేణుగోపాల్ కనిపెట్టారు. "ఆమె మాటల్లో పదునైన ఉక్కు ఉంది," అని తిరువనంతపురంకు చెందిన ఈ జర్నలిస్ట్ చెప్పారు. "ఆమె వందేళ్ళు జీవించిననప్పటికీ పసితనం మిగిలిన వ్యక్తిలా రాస్తుంది." ఇప్పటికీ ఆమె చాలా అలసిపోయినప్పుడు అతను ఆమెకు టైప్ చేయడానికి, రాసినదాన్ని సవరించడానికి సహాయం చేస్తారు. "ఆమె మలయాళంలోనూ, ఆంగ్లంలోనూ ఒకే అందంతో రాస్తుంది. ఆమె అలసిపోయినప్పుడు మాత్రమే నేను నా వేళ్ళను అందిస్తాను."
ఆశ గురించి ఆమె రాసిన నోట్స్, ట్రాప్డ్ ఇన్ ఎ కేజ్ బట్ వర్డ్స్ బ్రేక్ ఫ్రీ అనే శీర్షికతో 2023 నూతన సంవత్సర దినోత్సవం నాడు టెలిగ్రాఫ్ పత్రిక మొదటి పేజీలో కనిపించింది. ఎడిటర్ ఆర్. రాజగోపాల్ ఫేస్బుక్లో ఆమె రచనలను గమనించి, వాటిని వేయాలనుకున్నారు. ఆ తర్వాత కొద్దికాలంలోనే, ఆమె మలయాళ రచనలను విరళ్ పళుతిళే ఆగాశంగళ్ (వేళ్ళ మధ్య ఖాళీల నుంచి కనిపించే ఆకాశాలు) అనే పుస్తకంలో సంకలనం చేశారు. కేరళ పరిశ్రమల మంత్రి పి. రాజీవ్ దీనిని జనవరి 2023లో ఎర్నాకుళం ప్రెస్ క్లబ్లో విడుదల చేశారు. ఈ కార్యక్రమాన్ని ఆమె తన గదిలో నుండి తన తల్లి ఫోన్లో వీక్షించింది.
"అమ్మా, నా ఆకాశం ఇతర మనుషులను చేరుకుంటోంది చూడు!" అని ఆమె చెప్తూనే ఉంటుందని సెబా తల్లి సబీరా PARIతో చెప్పారు.










