అబ్దుల్ వహాబ్ థోకర్ ఉత్సాహవంతులైన ప్రయాణీకులను తన స్లెడ్జ్పై గుల్మార్గ్ మంచువాలులకు తీసుకువెళ్ళేందుకు సిద్ధంగా ఉన్నారు. అయితే జనవరి 14, 2024న నిరుత్సాహానికి గురైన థోకర్ తన వాహనం పైన కూర్చుని కనుచూపు మేరా కలతపెట్టే గోధుమ రంగులోని వట్టిపోయిన నేలను చూస్తున్నారు.
"ఇది చిలై కలాన్ (ముమ్మరమైన శీతాకాలం), కానీ గుల్మార్గ్లో మంచు అనేదే లేదు," విచారంగా అన్నారు 43 ఏళ్ళ థోకర్. గత 25 ఏళ్ళుగా స్లెడ్జిలు లాగుతోన్న థోకర్, ఇలాంటిదెప్పుడూ తాను చూడలేదని చెప్తూ భయపడ్డారు: "పరిస్థితులు ఇలాగే కొనసాగితే మేం తొందరలోనే అప్పుల పాలవుతాం."
కేంద్రపాలిత ప్రాంతమైన జమ్మూ కశ్మీర్లోని బారాముల్లా జిల్లాలో మంచు కప్పివుండే పర్వత ప్రాంతమైన గుల్మార్గ్ చాలా ప్రసిద్ధి చెందిన హిల్స్టేషన్. ప్రతి ఏటా ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ప్రజలు ఇక్కడకు వస్తారు. స్థానికంగా సుమారు 2000 మంది (2011 జనగణన) ప్రజలకే కాక, పని కోసం ఇక్కడకు ప్రయాణమై వచ్చే థోకర్ వంటి ఇతరుల ఆర్థిక వ్యవస్థకు కూడా దన్నుగా నిలవటంలో ఈ పర్యాటకమే కీలక పాత్ర పోషిస్తుంది.
బారాముల్లాలోని కలాన్తారా గ్రామంలో నివసించే ఈయన పని దొరుకుతుందనే ఆశతో ప్రతి రోజూ 30 కిలోమీటర్ల దూరం స్థానిక రవాణా సౌకర్యం ద్వారా ప్రయాణంచేసి గుల్మార్గ్కు వస్తుంటారు. "ఇప్పుడు నాకెవరైనా కస్టమర్ ఉన్నా కూడా, సవారీ చేయడానికి ఇక్కడ మంచు లేకపోవటం వలన నేను కేవలం 150-200 రూపాయలు మాత్రమే సంపాదించగలను," అన్నారాయన. "మేమిప్పుడు చేయగలిగినదల్లా (గతంలో కరిగిన మంచు నుండి) గడ్డ కట్టిన నీటి మీదుగా కస్టమర్లను తీసుకురావటమే."
జమ్మూ కశ్మీర్ అధికారిక వెబ్సైట్ ప్రకారం, "శీతాకాలంలో గుల్మార్గ్ ఒక 'అద్భుతమైన అనుభవం.' పూర్తిగా తెల్లటి మంచు దుప్పటి కప్పుకుని, మంచులో విన్యాసాలు చేసేవారికి (స్కీయర్స్) ఇది ఒక స్వర్గంలా భాసిస్తుంది. ఇక్కడ సహజంగా ఏర్పడిన వాలు ప్రదేశాలు చెక్కుచెదరనివి, సమర్థులైన స్కీయర్లకు ఒక సవాలుగా ఉంటాయి!"













