అదొక మందకొడిగా ఉన్న వేసవి మధ్యాహ్నం. 80ల వయసులో ఉన్న మా నానమ్మ కుసుమ్ వణకుంద్రే నా పక్కనే ఉన్న కుర్చీలో కూర్చుని ఒక తోరణ్ (తోరణం)ను అల్లుతున్నారు. నేను నా కళాశాల సెలవులను ఆస్వాదిస్తూ ఇంట్లోనే ఉన్నాను. బయటి వాతావరణం బయటకు అడుగు పెట్టలేనంత వేడిగా ఉంది. ముంబైలో ఉష్ణోగ్రత, ఈ దశాబ్దంలోనే అత్యధికంగా 39.7 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. మధ్యాహ్న భోజనం తర్వాత కొంచెం బద్దకంగా ఉన్న నేను, తన పాత జ్ఞాపకాలను నెమరువేసుకుంటోన్న మా నానమ్మ వెంటే నడుస్తున్నాను.
"నేను మహారాష్ట్ర, సాతారా జిల్లాలోని వడగావ్ అనే ఒక చిన్న గ్రామంలో పుట్టాను. అక్కడ ముప్పై మూడు కోటి దేవతలు [33 రకాల వేద దేవతలు] కొలువై ఉన్న అత్యంత పురాతనమైన జైరామ్ స్వామి ఆలయం ఒకటి ఉండేది. నేను చదువుకున్న బడి పిల్లలందరూ విశాలమైన ఆ ఆలయ ఆవరణలోకి చేరేవాళ్ళు. అక్కడ ఆడుకోవడానికి ఎంతో స్థలం ఉండేది. మా తరగతులు ముగిసిన తర్వాత, మేం హుతుతూ, కబడ్డీ, లంగ్డీ వంటి ఆటలు ఆడేవాళ్ళం. నాగపంచమి పండుగ రోజున కొందరు బాలికలు ఫుగడీ (ఒక జానపద నృత్యం) చేస్తూ పాటలు పాడేవారు. నా నలుగురు చెల్లెళ్ళు, నేను కలిసి ఎంతో సరదాగా గడిపేవాళ్ళం.
"ఆ బడిలో ఏడవ తరగతి వరకే ఉండేది. దాని తర్వాత నేను కుట్లు, అల్లికలు నేర్చుకున్నాను. పొలంపనిలో కూడా సహాయం చేసేదాన్ని. మా నాన్నకు పొలముంది. శేతీ హోతీ, పన్ ముంబై లా కామలా హోతే. ఆఫీస్ మధే కామ్ కరాయ్ఛే, ప్యూన్ హనూన్ [ఆయనకు పొలముంది, కానీ ఆయన ముంబైలో పనిచేసేవాడు. ఒక కార్యాలయంలో ‘ప్యూన్’గా పనిచేసేవాడు]. మా కుటుంబం గ్రామంలో ఉండేది. ఆ భూమి మా సొంతం. ఇప్పటికీ మా దగ్గరే ఉంది. నా సోదరుడు దాన్ని చూసుకుంటున్నాడు. మూడెకరాలుంది. ఆ రోజుల్లో మా నాన్న, ఆయన అన్నదమ్ములు, బంధువులందరి ఉమ్మడి కింద మొత్తం భూమి ఉండేది. సుమారు 23-24 ఎకరాల భూమి ఉండేది.
"ఈ ఎనిమిదిమంది యజమానులు చిరుధాన్యాలు, వేరుశనగలు, పెసలు వంటి విత్తనాలు చల్లడానికి ఇద్దరు మరాఠా కూలీలను పనికి పెట్టుకున్నారు. వేరుశనగలు తవ్వడం, శనగలు కోయడం, కూరగాయలు - వంగీ మ్హణా (వంకాయలు), పవతాచ్య శెంగా (మునగకాయలు), హర్భరచి భాజీ (శనగాకు) మేం సేకరించేవాళ్ళం. ఈ పనంతా చేసుకుంటూ, నాకు ఇరవై ఏళ్ళు ఎప్పుడు నిండాయో కూడా నేను గమనించనేలేదు.
“త్వరలోనే నా పెళ్ళి గురించి మాటలు మొదలయ్యాయి. ముంబై నుంచి ఒక సంబంధం రావటంతో పెళ్ళి నిశ్చయమయింది. 1965లో మేమంతా ముంబైకి వెళ్ళాం. నేను, మా అమ్మ, నాన్న, నా తోబుట్టువులు, మా నాన్న అన్నదమ్ములు, వారి భార్యలు, అందరం వెళ్ళాం. వడగావ్ నుండి రహ్మత్పూర్కు బస్‌లో వెళ్ళి, అక్కడి నుంచి రాత్రి రైలుకు ముంబై వెళ్ళాం.
"మా ఊరు విడిచి నేను చేసిన మొదటి ప్రయాణం అదె; ముంబైకి రావడం కూడా అదే మొదటిసారి. ముంబైచీ గర్డీ పహున్ థోడే గడ్బడ్ల్యా సర్హె ఝాలో [ముంబైలోని ఆ జనసందోహాన్ని చూసి నాకేదో కంగారుగా, ఉక్కిరిబిక్కిరిగా అనిపించింది]. అక్కడ అడుగుపెట్టిన రెండో రోజున నా పెళ్ళి జరిగింది, ఆ వెంటనే నేను అంధేరీలో ఉన్న నా అత్తవారింటికి వచ్చేశాను. నా మిస్టర్ (భర్త)ది కర్ణాటక. ఆయన ఒక ఆటోమొబైల్ కంపెనీలో లైన్‌మ్యాన్‌గా పనిచేసేవాడు. నేను ఆభరణాల తయారీ పనిని, మంగళసూత్రాలు అల్లడాన్ని మొదలుపెట్టాను. అలా మా వైవాహిక జీవితం ప్రారంభమైంది. మాకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. ఇప్పుడు ఇద్దరు మనవరాళ్ళు, ఇద్దరు మనవలు ఉన్నారు."
"నువ్వు ముంబై బయటకు కూడా వెళ్ళినట్టున్నావు కదా?" అని నానమ్మని అడిగాను.
"కన్యాకుమారి, కలకత్తా, జైపూర్, కాశీ, కశ్మీర్. ఇంకా మీ తాతతో కలిసి సింగపూర్, నేపాల్ కూడా."
అయితే వీటన్నిటిలో నీకిష్టమైన ప్రయాణం ఏది ఆజీ (నానమ్మా)?
"ముంబైకి వచ్చిన ముప్పై ఏళ్ళ తర్వాత నేను మా అమ్మతోనూ చెల్లితోనూ కలిసి వెళ్ళిన కాశీ యాత్ర. అది అందరూ ఆడవాళ్ళే పాల్గొన్న ఒక యాత్ర. మా వదిన తరచుగా ఇలాంటి యాత్రలకు వెళ్తుండేది. ఆమె నాకు దీని గురించి చెప్పి, నన్ను కూడా రమ్మని అడిగింది. నేను సరే అన్నాను."
తాతయ్యేమన్నాడు? నీకు భయమేయలేదా నాకు ప్రశ్నలున్నాయి. మా నానమ్మ చెప్తోన్న కథ ఉన్నట్టుండి ఉత్కంఠభరితంగా మారిపోతోంది. నా జీవితమంతా ఆమెను వంట చేస్తూ, అల్లికలు అల్లుతూ, నవ్వుతూ, తన కుటుంబానికి సేవ చేసే ఒక సౌమ్యమైన, దయగలిగిన, ముచ్చటైన వృద్ధురాలిగానే చూశాను. నిరంతరం ఇంటిపట్టునే ఉంటూ, అన్ని విధాలా ఒక గృహిణిగా ఉండే వ్యక్తిగానే చూశాను. కానీ ఇప్పుడు అకస్మాత్తుగా, మూడున్నర దశాబ్దాల క్రితం ఆమె తన తల్లి, సోదరితో కలిసి చేపట్టిన ఈ సాహసోపేతమైన, అపురూపమైన యాత్ర గురించి తెలుసుకుంటున్నాను. నేను మరింత తెలుసుకోవాలనుకున్నాను కూడా.
“కాయ్ నయ్, జా మ్హాణున్ సంగిత్లా. త్యాంచి బహినచ్ నా తీ, బహినీ బారొబార్ జాతేస్ తర్ జా. త్యా బాయ్కాంచీ సహల్ హోతీ, తే యూ శకత్ నవ్తే [అలాంటిదేం లేదు. నా భర్త వెళ్ళు అన్నాడు. నేనతని సోదరితోనే కదా వెళ్తున్నది? నువ్వు నా సోదరితోనే కదా వెళ్ళేది, అలాగే వెళ్ళు. అందరూ ఆడవాళ్ళే చేసే యాత్ర కావటంతో అతను మాతో రాలేడు. నాకేమో వెళ్ళాలని బాగా ఉంది. భయమో ఆందోళనో అనేదే లేదు]. ఫిరాయ్లా జయ్చో మగ్ భీతి కస్లీ వాట్నార్ [ప్రయాణం చేయబోతూ ఎందుకు భయపడటం?]
"నాకప్పుడు 50 ఏళ్ళు. శలన్ ఆజి [ఆమె చెల్లెలు] రెండేళ్ళు చిన్నది. మా అమ్మకు 72 ఏళ్ళు ఉండవచ్చు. పహిలీ లోకా కటక్ హోతీ నా రే. ఆతా అమ్హీ కసా కటక్ నహీ ఆహే యెవ్డా. ఆంచి ఆఇ కటక్ హోతీ శేవత్ పర్యంత్ చలలత్ హోతీ చాంగ్లీ [పూర్వం ప్రజలు దృఢంగా, బలంగా ఉండేవారు. ఇప్పుడు మనం అంత దృఢంగా లేము. మా అమ్మ చాలా బలంగా ఉండేది, ఆమె చివరి క్షణం వరకు నడుస్తూనే ఉంది]. మేం 15 రోజుల కంటే ఎక్కువ సమయం కోసం బుక్ చేసుకున్న ఆ బస్సులో 45 మంది మహిళలం ఉన్నాం. ఆ యాత్ర ఖర్చుల కోసం నా ఇద్దరు కొడుకులు కలిసి నాకు 4,000 రూపాయలు ఇచ్చారు. మేం కాశీ, ఉజ్జయిన్, మధుర, వంటి 27 పుణ్యక్షేత్రాలను సందర్శించాం…”
నేను కళ్ళను విశాలం చేసుకొని, మా నానమ్మ చెప్పే మరో కథను వినటానికి సిద్ధమయ్యాను…


