గురుగ్రామ్‌లోని బంజారా మార్కెట్లో కాన్సీ రామ్ తన దుకాణం ముందు నిలబడివున్నారు. ఆయన వెనుక వెదురు, టార్పాలిన్‌తో వేసిన ఒక చిన్న షెడ్డులో అమ్మకానికి ఉంచిన రకరకాల చెక్క సామాగ్రిని ఇరుకు ఇరుకుగా సర్ది ఉంచారు. వాటికి దగ్గర్లోనే ఆయన భార్య ఆశ కూర్చున్నారు. ఆమె ఒక తడి గుడ్డని తన తల మీద వేసుకున్నారు. ఆ రోజు మొదలైంది; వేసవిలో దిల్లీలోని ఉదయాలు కూడా చాలా కఠినంగా ఉంటాయి. కానీ తన తల మీద వేసుకున్న ఆ తడి గుడ్డ తనని చల్లగా ఉంచుతుందని ఆవిడ చెబుతున్నారు.
కాన్సీ రామ్‌కి గానీ, ఆశకి గానీ వేడి కొత్తేమీ కాదు. సంప్రదాయ కమ్మరులైన గాడియా లోహార్ సముదాయానికి నిప్పు ఒక నిరంతర సహచరి. “ఐసీ గర్మీ మే గరమ్ గరమ్ లోహే కో పీటే థే…ఆంచ్ కే సామ్నే భోత్ మెహనత్ కీ హై [మేం ఇలాంటి వేడిలోనే ఇనుమును కొట్టేవాళ్ళం… సలసలా మండే మంట ముందు చాలా కష్టపడ్డాం].”
తమ మూలాలు రాజస్థాన్‌లో ఉన్నాయని చెప్పే గాడియా లోహార్లు, అక్కడ అత్యంత వెనుకబడిన సముదాయంగా (ఎమ్‌బిసి) జాబితా చేయబడ్డారు. అయితే, వాళ్ళు అధిక సంఖ్యలో నివసించే దిల్లీ, దాని పరిసర ప్రదేశాలు, హరియాణా వంటి కొన్ని ప్రాంతాలలో మాత్రం వారిని ఇతర వెనుకబడిన తరగతులుగా (ఒబిసి) వర్గీకరించారు. సొంత భూమి లేని 98 శాతం సంచార, అర్ధ-సంచార సముదాయాలలో గాడియా లోహార్లు కూడా ఒక భాగమే. భారతదేశంలోని సంచార సముదాయాలలో, కేవలం 11 శాతం మంది మాత్రమే ప్రభుత్వ భూములలో నివసిస్తున్నారు. చాలామంది గాడియా లోహార్లు తమ ఎడ్ల బండ్లలో (గాడీ) నివసిస్తూ, ప్రయాణిస్తుంటారు; ఈ బండ్లే వాళ్ళకి సంచార గృహాలుగా, పనిప్రదేశాలుగా ఉపయోగపడుతుంటాయి.
కాన్సీ రామ్ కొన్నేళ్ళపాటు - అది ఉగ్రమైన ఎండాకాలమైనా, వణికించే చలికాలమైనా - ఊరూరా తిరుగుతూ చేతితో తయారుచేసిన ఇనుప పనిముట్లను, పాత్రలను, ఇతర వస్తువులను అమ్ముతూ గడిపారు.
అయితే, గత రెండు దశాబ్దాలుగా రాజధాని నగరమైన దిల్లీ, దాని పరిసర ప్రాంతాలలో పెరిగిపోతోన్న ఉష్ణోగ్రతలు అతనిపై తీవ్ర ప్రభావం చూపాయి. దాంతో, ఆయన ప్రయాణాలు చేయడం ఆపేశారు. “ఇలాంటి మండుటెండలో ఇంటింటికీ తిరగడంలో అర్థం లేదు. అందుకే, మేం ఆ వ్యాపారాన్ని వదిలిపెట్టి ఈ పని మొదలుపెట్టాం,” ఆయన PARIకి చెప్పారు.












