“హమారే చూల్హే తో ఇన్ లాశోఁ సే జల్తే హైఁ (ఈ శవాల వల్లే మా వంటింట్లో పొయ్యిలు వెలుగుతున్నాయి),” వారణాసిలోని రాజా హరిశ్చంద్ర ఘాట్‌లో ఆరోజు రెండవ దహన సంస్కారానికి చితి పేర్చుతున్న విజయ్ ఈ మాటలన్నారు. పొగ, బూడిద కళ్ళనూ ముక్కుపుటాలనూ మండిస్తున్నా కూడా, చేత్తో విసురుకుంటూ అతను వాటి మధ్యలోనే దారిచేసుకుంటూ నడుస్తున్నారు.
35 ఏళ్ళ విజయ్ చౌధరి బనారస్‌లో షెడ్యూల్డ్ కులంగా జాబితా చేసివున్న డోమ్ సముదాయానికికి చెందినవారు. తన కుటుంబం నుంచి ఈ వృత్తిలోకి వచ్చిన నాలుగోతరం వాడతను. దేశం నలుమూలల నుండి కుటుంబసభ్యులు వారణాసికి తీసుకొచ్చిన తమవారి మృతదేహాలకు విజయ్ అంత్యక్రియలు జరిపిస్తారు.
అందరిలాగే విజయ్‌కి కూడా ఇంట్లో ఎల్పిజి సిలిండర్ ఉన్నప్పటికీ గత 25 రోజులుగా గ్యాస్ దొరకలేదు. “సిలిండర్ బుక్ చేయడానికి ఫోన్ చేస్తే ఎవరూ ఎత్తట్లేదు. వెయ్యి రూపాయలకు వచ్చే [14.2 కిలోగ్రాముల] సిలిండర్‌ను రెండువేలు పెట్టి కొనే స్తోమత నాకు లేదు. ఇక తప్పేది లేక పాత పద్ధతుల ప్రకారం కట్టెలతో వంట చేసుకుంటున్నాం. అందుకని ప్రతిరోజూ శవాలు కాలిన తర్వాత మిగిలిన కట్టెముక్కలను వంటకోసం ఇంటికి తీసుకెళ్తున్నాం,” విజయ్ PARIతో చెప్పారు.















