"మద్యం తాగితే ఆకలితో సహా ఎన్నో విషయాలను మరచిపోవటం చాలా సులభం," సింగ్‌ధుయి గ్రామానికి చెందిన రబీంద్ర భుయ్యాఁ అంటారు.
యాబై ఏళ్ళు దాటిన భుయ్యాఁ ఒక శబర్ (పశ్చిమ బెంగాల్లో శబర్గా జాబితా చేసివున్నారు) ఆదివాసి. ముండా ఆదివాసీ సముదాయానికి చెందిన శబరులు తూర్పు భారతదేశంలో నివసిస్తుంటారు. వీరిని శౌరా, శొర, శబర్, శూరీలు అని కూడా పిలుస్తారు. లోధా శబరులు (అవిభక్త) పశ్చిమ మేదినీపూర్‌లో ఎక్కువగా ఉంటారు; ఖాడియా శబరులు ఎక్కువగా పురూలియా, బాఁకురా, (అవిభక్త) పశ్చిమ మేదినీపూర్‌లలో నివాసముంటారు.
మహాశ్వేతా దేవి రాసిన The Book of the Hunter (మొదటగా 1994లో బ్యాధ్ఖండొ పేరుతో బంగ్లా భాషలో ప్రచురితమైంది) ఈ సముదాయపు అత్యంత పేదరికాన్ని గురించీ, వారి అట్టడుగు స్థితిని గురించీ వర్ణిస్తుంది. దశాబ్దాలు దాటిన తర్వాత కూడా ఆ పరిస్థితి పెద్దగా మారిందేమీ లేదు. పశ్చిమ బెంగాల్లో ఆదివాసుల జీవన ప్రపంచం పేరుతో 2020లో వచ్చిన ఒక నివేదిక, "సర్వేచేసిన గ్రామాలలోని 67 శాతం గ్రామాలు ఆకలితో అలమటిస్తున్నట్టుగా తెలుస్తోంది," అని తెలిపింది.
ఈ సముదాయాన్ని 18వ శతాబ్దపు చివరి సగం వరకూ కూడా "నేరస్థ జాతి 'గా బ్రిటిష్ పాలన ముద్రవేసింది. 1952లో ఆ ముద్రను తొలగించారు. సంప్రదాయక వేటగాళ్ళైన వీరు పండ్లను, ఆకులను, దుంపలను సేకరించడంలోనూ, అడవిలోని జంతువులను వేటాడటంలోనూ నేర్పు కలిగినవారు. స్వతంత్రం వచ్చిన తర్వాత కొంతమందికి సాగుచేసుకోవడానికి భూమి ఇచ్చారు, కానీ ఆ భూమి రాళ్ళతో నిండిన బంజరు కావటంతో వారు చివరకు వలస కూలీలుగా మారిపోయారు. వారిపై నేరస్థ జాతిగా ముద్రను తొలగించినప్పటికీ, ఆ కళంకం అలాగే నిలిచిపోయింది. దాంతో తమ ప్రతి కదలికకు కళ్ళెం వేసే స్థానిక పోలీసుల, అటవీ అధికారుల దయాదాక్షిణ్యాలపై అధారపడి వారు జీవనం సాగిస్తున్నారు.
ఆదాయ అవకాశాలు చాలా కొద్దిగా ఉండటంతో, పశ్చిమ మేదినీపూర్, ఝాడ్‌గ్రామ్ జిల్లాలలో నివాసముండే శబర్ సముదాయాలను ఆకలి తాకింది. భుయ్యాఁ వంటి అనేకులు తమ ఆకలిని మద్యంతో అణచిపెడతారు. లేదా, "మేం మూడు పూటలా పంతా భాత్ (పులియబెట్టిన అన్నం) తింటాం. మేం బతికేది దానిమీదే," అంటారు బంకిమ్ మల్లిక్. తపోబన్ గ్రామ నివాసి అయిన 55 ఏళ్ళ మల్లిక్ ఇక్కడ, ఇంట్లోని ప్రతి కుటుంబ సభ్యునికి నెలకు ఐదు కిలోల చొప్పున ప్రజా పంపిణీ వ్యవస్థ (పిడిఎస్) ద్వారా పంచిపెట్టే బియ్యం గురించి ప్రస్తావిస్తున్నారు. "నూనె, ఉప్పు విలాసం కింద లెక్క" అంటారాయన. ఆయన తన పాడుబడిపోయిన ఇంటిముందు కూర్చొని పంతా భాత్ తింటున్నారు.























