ఈ కథనం పులిట్జర్ సెంటర్ మద్దతుతో పార్థ్ ఎమ్. ఎన్. రాసిన సిరీస్లో భాగం.
వర్షాకాలం రాక ముందు తాను చేసిన వాగ్దానం ఇప్పుడు 53 ఏళ్ళ దేవురావ్ నాగరేను వెంటాడుతోంది.
మోకాలి లోతు నీటిలో నిలబడి, భారీ వర్షం సృష్టిస్తున్న విధ్వంసం నుండి తన వ్యవసాయ భూమిని కాపాకోవడానికి ప్రయత్నించడంలోనే ఆయనకు సెప్టెంబర్ నెలంతా గడిచిపోయింది. చాక్ళంబా గ్రామంలోని కొండవాలుపై ఉండే అతని 8 ఎకరాల పొలం వరదల సమయంలో మరింత దుర్బలంగా మారుతుంది.
“వాననీరు నేరుగా నా పొలం గుండా ప్రవహిస్తుంది,” ఆయన వివరించారు. “ఆ నీటిని బయటికి పంపే మార్గాన్ని సృష్టించేందుకు నేను ప్రతిరోజూ కొన్ని గంటల సమయాన్ని వెచ్చించాను.”
కానీ, ఒళ్ళు హూనమయ్యేలా చేసిన శ్రమంతా వృథా అయ్యింది. గర్జించే మేఘాలను ఎదుర్కొని అతను గెలవలేకపోయారు. అతని పత్తి, కంది, చెరకు పంటలు నాశనమయ్యాయి. దాంతో, అతనికి రూ.3 లక్షలకు పైగా నష్టం వాటిల్లింది. కొండల మీది నుంచి ఉధృతంగా ప్రవహించిన నీటి వల్ల అతని వ్యవసాయ భూమిలోని సారవంతమైన పైమట్టి కూడా కొట్టుకుపోవడంతో, అతని జీవనోపాధి ప్రమాదంలో పడింది.
అయితే, ఈ నష్టాన్ని ఎలా భర్తీ చేయాలనే ఆలోచన కంటే ఎక్కువగా, మహారాష్ట్రలోని ఒక ప్రసిద్ధ పుణ్యక్షేత్రానికి తాను విరాళంగా ఇస్తానని వాగ్దానం చేసిన రూ.1.7 లక్షలను సమకూర్చడంలో విఫలమవుతానేమోననే ఆలోచన నాగరేని కలవరపెడుతోంది.















