"ఈ ప్రాంతంలో ఎన్నికల రోజు ఒక పండుగలాంటిది," తాను బొంతగా అల్లబోయే బట్టలను వరుసలు పేరుస్తూ అన్నారు మర్జినా బేగమ్. "పని కోసం ఇతర రాష్ట్రాలకు వలసపోయిన జనం వోటు వేయడానికి ఇళ్ళకు తిరిగివస్తారు."
ఆమె నివసించే రూపాకుసి గ్రామం మే 7, 2024న పోలింగ్ జరగబోయే ధుబ్రి లోక్‌సభ నియోజకవర్గంలో ఉంది.
కానీ 48 ఏళ్ళ మర్జినా వోటు వేయలేదు. "నేనా రోజును పట్టించుకోనట్టుంటాను. జనాన్ని తప్పించుకోవడానికి నేను ఇంట్లోనే దాక్కుంటాను కూడా."
మర్జినా వోటర్ల జాబితాలో అనుమానాస్పద వోటర్ (డి-వోటర్)గా నమోదైవున్నారు. ఈ రకంగా జాబితా అయిన 99,942 మంది వోటర్లలో ఆమె కూడా ఒకరు. వీరంతా తమ భారతీయ పౌరసత్వాన్ని నిరూపించుకునే విశ్వసనీయమైన సాక్ష్యాలను అందించలేకపోయారు. వీరిలో అస్సామ్‌లో నివాసముండే బంగ్లా భాష మాట్లాడే హిందువులు, ముస్లిములు ఎక్కువగా ఉన్నారు.
డి-వోటర్లను కలిగి ఉన్న ఏకైక భారతీయ రాష్ట్రమైన అస్సామ్‌లో, బంగ్లాదేశ్ నుండి అక్రమంగా వచ్చినట్టు చెప్తోన్న వలసలు ఎన్నికల రాజకీయాలలో కీలకమైన అంశం. భారత ఎన్నికల సంఘం 1997లో డి-వోటర్ విధానాన్ని ప్రవేశపెట్టింది. అదే సంవత్సరం మర్జినా తన పేరును వోటర్ల జాబితాలో చేర్చడానికి మొదటగా ఎన్యుమరేటర్లకు ఇచ్చింది. “అప్పట్లో, వోటరు జాబితాలో వ్యక్తుల పేర్లను చేర్చడానికి పాఠశాల ఉపాధ్యాయులు ఇంటింటికీ వచ్చేవారు. నా పేరు కూడా ఇచ్చాను,” అని మర్జినా చెప్పారు. “కానీ ఆ తర్వాత వచ్చిన ఎన్నికల సమయంలో నేను వోటు వేయడానికి వెళ్ళినప్పుడు, నన్ను అనుమతించలేదు. నేను డి-వోటర్ని అని చెప్పారు."





