ఆమెను నేను మొదట ఎక్కడ చూశాను? నేను చదివిన పుస్తకంలోనా, టివిలో చూసిన డాక్యుమెంటరీలోనా, లేదంటే అన్యాయంపై పిడికిలి బిగించి దూసుకెళ్తున్న ఏదైనా ఒక వీధిలోనా? బహుశా ఆమె ఒక కవిత అయుంటుందేమో. లేదా నాకు గగుర్పాటు కలిగించిన స్వేచ్ఛా నినాదమైనా అయుండొచ్చు.
నిజాయితీగా చెప్పాలంటే, నేనామెను చివరిసారి ఎప్పుడు చూశానో నాకు గుర్తులేదు.
నా జ్ఞాపకశక్తికి అందలేనన్నిసార్లు ఆమె తన రూపాలను, పేర్లను మార్చుకుంది. కొన్నిసార్లు ఆమె దిండుక్కల్‌లో తన పని ప్రదేశంలోని నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ, ఆ శిథిలాల నుండి ఒక కార్మిక సంఘాన్ని కుడుతోన్న ఒక కుట్టుపని చేసే మహిళ. మరికొన్నిసార్లు ఆమె తన హక్కులను సాధించుకోవడానికి ఒక ర్యాలీలో పాల్గొనేందుకు హుబ్బళ్లి నుండి బెంగళూరు వరకు అద్దె ట్రాక్టర్‌పై ప్రయాణిస్తోన్న ఒక వ్యవసాయ కూలీ. ఇంకొన్నిసార్లు, చుట్టుపక్కల ఎవరూ ఆకలితో ఉండకూడదనే ఉద్దేశంతో, ఇంటింటికీ తిరిగి ఉన్న కొద్దిపాటి ఆహారాన్ని సేకరిస్తోన్న దక్షిణ కేరళకు చెందిన ఒక పాత కామ్రేడ్. అనేక రూపాలుగా మారే ఆమె అదే మొండి ధైర్యంతో, అదే లొంగిపోని తత్వంతో విభిన్న రూపాల్లో తిరిగి వస్తుంది.
అదిగో! నేనామెను మళ్ళీ చూశాను. ఇప్పుడామె బారికేడ్ల మీదుగా గంతువేసి దాటుతోన్న ఒక చిన్నారి. ఆ తర్వాత, నేలకూలిన వారికి అండగా నిలుస్తోన్న వ్యక్తి. ఆమె లొంగిపోవడానికి నిరాకరించే ఆశలా కనిపిస్తోంది.
ఈ భూమి ఎప్పటికీ ఆమెదే. ఆజాద్!


