ఒక్క నెల కాలంలోనే పోలీసులు గ్రంథాలయాన్ని మూడుసార్లు మూసేయించే ప్రయత్నం చేశారు. కానీ అది మళ్ళీ మళ్ళీ తెరుచుకుంటూనే ఉంది.
ఒక యువజన ఉద్యమంగా ఆవిర్భవించిన కాక్రోచ్ జనతా పార్టీ అనే మీమ్ పేజీ, పరీక్షల ప్రశ్నపత్రాల లీకేజీలు, అక్రమాలలో వెల్లడైన అవినీతికి బాధ్యత వహించి, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ, జూన్ 20, 2026న దిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన దీక్షకు పిలుపునిచ్చింది. ఈ నిరసన జరుగుతోన్న ప్రదేశంలోనే ఒక గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయాలని ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్ (AISF) నిర్ణయించింది. దీని వెనుక ఉన్న ఉద్దేశ్యం చాలా సరళమైనది.
"రాబోయే కొద్ది రోజుల పాటు జంతర్ మంతర్ నిరసనకారులకు నివాసంగా మారబోతోంది," ఎఐఎస్ఎఫ్ దేశీయ అధ్యక్షుడైన విరాజ్ దేవాంగ్ అన్నారు. "మీరు రోజంతా నినాదాలిస్తారు, ఉపన్యాసాలు వింటారు. అయినా కూడా మీ సొంతానికి చాలా ఖాళీ సమయం మిగులుతుంది. ఇలాంటి పరిస్థితులలో పుస్తకాలే అసలైన తోడు. నిరసనకారులు, విద్యార్థులు సాహిత్యాన్ని చదవటం ద్వారా తమ సామాజిక, రాజకీయ చైత్యన్యాన్ని మెరుగుపరచుకుంటారనేదే మా ఆలోచన.”
విద్యార్థి కార్యకర్తలు ఒక చెక్క బల్లను తీసుకువచ్చి, దానిపై 'ప్రధాన్ పదవి నుంచి దిగిపోవాలి 'అని రాసివున్న ఒక ఎర్రని బట్టను పరిచారు. మొదటి రోజున, "మా దగ్గర శివాజీ మహరాజ్, భగత్ సింగ్, బాబాసాహెబ్ అంబేడ్కర్ల పుస్తకాలున్నాయి," రోజూవారీగా ఆ గ్రంథాలయాన్ని నిర్వహించిన విద్యార్థి కార్యకర్తలలో ఒకరైన 20 ఏళ్ళ మోహిత్ అన్నారు. "విప్లవ సాహిత్యం లేని నిరసన సిద్ధాంతం లేని నాయకుడి వంటిది. నిరసనకారులకు ప్రతిఘటించటమెలాగో, తిరుగుబాటు చేయటమెలాగో సాహిత్యమే మార్గనిర్దేశం చేస్తుంది.”









